బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. వర్షం ఆటంకం కలిగించినా చరిత్రలో నిలిచిపోయేలా గొప్పగా పోరాడి ఆఖరి టెస్టును గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్‌పై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. ఇక పొట్టి ఫార్మాట్ సిరీస్‌పై కన్నేసింది. ఇవాళ నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటున్నానని పరోక్షంగా పేర్కొన్నాడు. సూర్య ప్రకటనతో ముంబై ఇండియన్స్ అభిమానుల్లో గందరగోళం మొదలైంది. మరోవైపు హార్దిక్ పాండ్య కెప్టెన్సీ పగ్గాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

భవిష్యత్‌లో ఐపీఎల్ కెప్టెన్సీపై సూర్య ఇలా స్పందించాడు. ''మీరు గూగ్లీ బౌలింగ్ చేశారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. దాని గురించి మీరు తప్పక తెలుసుకుంటారు. ఇక ఈ కొత్త బాధ్యతలను (టీమిండియా కెప్టెన్‌గా) ఆస్వాదిస్తున్నా. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఆడే సమయంలో నాకు అనిపించే సూచనలు అందిస్తూ ఉండేవాడిని''
''ఇటీవల శ్రీలంక సిరీస్‌కు నాయకత్వం వహించా. అంతకుముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు కెప్టెన్సీ వహించా. జట్టును ముందుకు ఎలా తీసుకువెళ్లాలో ఇతర కెప్టెన్ల నుంచి నేర్చుకున్నాను'' అని సూర్య పేర్కొన్నాడు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో హార్దిక్ ముంబై పగ్గాలు చేపట్టాడు. టీమిండియా భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ అవుతాడనే ఉద్దేశంతో ముంబై ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
కానీ భారత టీ20 జట్టుకు సారథిగా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించారు. వచ్చే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హార్దిక్‌ను సారథిగా ముంబై ఫ్రాంచైజీ కొనసాగిస్తుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే సూర్య తాజా ప్రకటనతో హార్దిక్ కెప్టెన్సీ ప్రమాదంలో పడిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూర్యకే ముంబై ఫ్రాంచైజీ జట్టు పగ్గాలు అందించే అవకాశం ఉందని అంటున్నారు.