చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ డకౌటయ్యాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుముందే పెవిలియన్‌కు చేరాడు. హసన్ మహ్మద్ లెగ్ సైడ్ దిశగా వేసిన బంతిని వెంటాడి వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి చిక్కాడు. అనంతరం నిరాశగా మైదానాన్ని వీడాడు.
అయితే డకౌటైన గిల్ కోరుకోని రికార్డుల జాబితాలో చోటు దక్కించకున్నాడు. ఓ క్యాలెండెర్ ఇయర్‌లో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు డకౌటైన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ చేరాడు. గిల్ ఈ ఏడాది ఇప్పటికి మూడు సార్లు డకౌటయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గిల్ హైదరాబాద్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో, రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు.

కాగా, ఈ జాబితాలో అగ్రస్థానంలో మొహిందర్ అమర్‌నాథ్ ఉన్నాడు. 1983లో ఆయన ఏకంగా అయిదు సార్లు డకౌటయ్యాడు. ఇక తర్వాతి స్థానాల్లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (1969), దిలీప్ వెంగసర్కార్ (1979), వినోద్ కాంబ్లి (1994), విరాట్ కోహ్లి (2021), శుభ్‌మన్ గిల్ (2024) ఉన్నారు. వీరందరూ ఓ క్యాలెండర్ ఇయర్‌లో మూడు సార్లు డకౌయ్యాడు.
అయితే గత కొన్నాళ్లుగా గిల్ పేలవ ప్రదర్శన టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. బంగ్లాదేశ్ సిరీస్‌తో అయినా గిల్ పుంజుకుంటాడనుకుంటే నిరాశే మిగిలింది. పైగా డకౌట్లలో రికార్డు కూడా సాధించాడు. దీంతో గిల్‌పై నెట్టింట్లో ట్రోల్స్ వస్తున్నాయి. ప్రిన్స్ మామూలోడు కాదని, డకౌట్లలోనూ రికార్డులే అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. గిల్‌ను క్రికెట్ అభిమానులు ప్రిన్స్‌గా అభివర్ణిస్తారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో 66.1 ఓవర్లకు భారత్ 270/6 స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (77*), రవీంద్ర జడేజా (48*) క్రీజులో ఉన్నారు. యశస్వీ జైస్వాల్ (56; 118 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (6; 19 బంతుల్లో, 1 ఫోర్), శుభ్‌మన్ గిల్ (డకౌట్), విరాట్ కోహ్లి (6; 6 బంతుల్లో), కేఎల్ రాహుల్ (16; 52 బంతుల్లో, 1 ఫోర్) విఫలమయ్యారు. పంత్ (39; 52 బంతుల్లో, 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హసన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీశాడు.