బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా సారథి రోహిత్ శర్మ వైఖరి బాగోలేదని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. జడేజాను తక్కువగా అంచనా వేస్తూ రోహిత్ కెప్టెన్సీ చేస్తున్నాడని ఆరోపించాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు జడేజాకు రోహిత్ బంతి అందివ్వకపోవడంపై మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు రెండో రోజు వర్షార్పణమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటకు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో 35 ఓవర్లు మాత్రమే ఆట కొనసాగింది. బంగ్లాదేశ్ మూడు వికెట్లకు 107 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (6), మోమినుల్ హక్ (40) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

తొలి రోజు ఆటలో ఆకాశ్ దీప్ పది ఓవర్లు, బుమ్రా , అశ్విన్ చెరో తొమ్మిది, మహ్మద్ సిరాజ్ ఏడు ఓవర్లు బౌలింగ్ చేశారు. అయితే ప్రత్యర్థిపై స్పిన్‌ను ప్రయోగించాలని భావించిన ప్రతిసారి రోహిత్.. అశ్విన్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడని మంజ్రేకర్ అన్నాడు. అంతేగాక ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉంటే జడేజాకు బౌలింగ్ ఇవ్వట్లేదని తెలిపాడు. ఓ బౌలర్‌ను కెప్టెన్‌గా అతిగా నమ్మవచ్చని, కానీ లెఫ్ట్ హ్యాండర్ల వికెట్లను జడేజా సాధించలేడని అనుకోవద్దని రోహిత్‌కు మంజ్రేకర్ సూచించాడు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (27), మోమినుల్ హక్ ఓ దశలో క్రీజులో పాతుకుపోయేలా కనిపించారు. ఈ ఇద్దరి భాగస్వామ్యాని తెరదించడానికి ఇతర బౌలర్లకు రోహిత్ అవకాశం ఇచ్చాడు కానీ, జడేజాకు ఇవ్వలేదని మంజ్రేకర్ వాదన. ఈ ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లు కావడంతోనే జడేజాకు బంతి అందివ్వలేదని అంటున్నాడు.
ఈ క్రమంలో రోహిత్‌ను ఉద్దేశిస్తూ మంజ్రేకర్ ట్వీట్ కూడా చేశాడు. ''రోహిత్ ఈ గణాంకాలను చూడాలి. జడేజా వర్సెస్ కుక్... 2016 సిరీస్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కుక్‌ను జడేజా ఆరు సార్లు ఔట్ చేశాడు'' అని ట్వీటాడు. దానికి వివరణ కూడా ఇచ్చాడు. ''బౌలర్లను ఉపయోగించడంలో ప్రతి కెప్టెన్‌కు ఓ విధానం ఉంటుంది. కొంతమంది బౌలర్లను కెప్టెన్ ఎక్కువగా నమ్ముతుంటారు కాబట్టి దీనిలో ఎలాంటి తప్పు లేదు. కానీ నేను ఓ విషయాన్ని గమనించాను''
''ప్రస్తుత సిరీస్‌లోనే కాదు, స్పిన్‌ను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు రోహిత్.. అశ్విన్‌కు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. తొలి రోజు ఆటలో ఓ కారణం ఉందని అర్థం చేసుకోగలను. ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లు కావడంతో అలా చేశాడనుకోవచ్చు. అయితే పంత్‌ను షకిబ్ తన బౌలింగ్‌తో ఇబ్బందిపెట్టాడు. ఓ డ్రాప్ క్యాచ్ కూడా ఉంది. అయితే టెస్టుల్లో ఈ ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ.. జడేజా నాణ్యమైన బౌలర్. లెఫ్ట్ హ్యాండర్లపై మెరుగైన రికార్డు కూడా ఉంది. గుర్తుపెట్టుకో..కుక్‌ను 8 ఇన్నింగ్స్‌లో జడ్డూ ఆరు సార్లు ఔట్ చేశాడు. జడేజాకు బంతి అందివ్వకపోవడం నిరాశ కలిగించింది.'' అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.