భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. కాన్పూర్ వేదికగా ఇవాళ నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అదే జోరును కాన్పూర్ టెస్టులోనూ ప్రదర్శించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలతో సన్నద్ధమవుతోంది.
బంగ్లాను చిత్తుగా ఓడించి వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు రేసులో మరింత ముందంజలో ఉండాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో అయినా గట్టి పోటీనివ్వాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. భారత్‌పై తొలి టెస్టు గెలుపు రుచి చూడాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది. ఓవరాల్‌గా భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇది 15వ టెస్టు.

కాన్పూర్‌లో భారత్ 23 టెస్టులు ఆడింది. ఏడింట్లో విజయం సాధించింది. మూడింట్లో ఓటమి, 13 మ్యాచ్‌లు డ్రాగా ముగించింది. చివరిగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. కాగా, ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ అరగంట ఆలస్యమైంది. ఇవాళ ఉదయం వర్షం జాడ లేనప్పటికీ, గురువారం రాత్రి కురిసిన వాన కారణంగా ఔట్ ఫీల్డ్ కాస్త తడిగా మారింది. సిబ్బంది శ్రమించడంతో 10 గంటలకు టాస్ వేశారు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
అయితే మూడు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగలేదు. తొలి టెస్టులో ఆడిన తుదిజట్టునే ఈ మ్యాచ్‌లో కొనసాగిస్తున్నారు. టాస్‌కు ముందు కుల్‌దీప్ వార్మప్ చేయడంతో..ఈ లోకల్ బాయ్ తుదిజట్టులో ఉంటారని భావించారంతా. కానీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు రోహిత్ టాస్ సమయంలో పేర్కొన్నాడు. పిచ్ కాస్త మృదువుగా ఉందని, ఫాస్ట్ బౌలర్లతో ఉపయోగించుకోవాలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. అందుకే తొలుత బౌలింగ్ కూడా ఎంచుకున్నట్లు వివరించాడు. మరోవైపు బంగ్లాదేశ్ తుదిజట్టుతో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి.
తుది జట్టు వివరాలు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.
బంగ్లాదేశ్: షాద్మాన్ ఇస్లాం, జాకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, హసన్ మహ్మద్, ఖలీద్ అహ్మద్.