కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. ప్రత్యర్థితో కంటే రోహిత్ సాహసోపేత నిర్ణయాలతోనే టీమిండియాకు సవాలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. టాస్ గెలిచిన రోహిత్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
అయితే భారత గడ్డపై ఇది సాధారణ విషయం కాదు. స్వదేశంలో భారత కెప్టెన్ టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకుంటారు. భారత్‌లోని పరిస్థితులకు ఇదే ఉత్తమం. మొదటి ఇన్నింగ్స్‌లో సాధ్యమైనంత ఎక్కువగా పరుగులు సాధిస్తారు. క్రమంగా బంతి టర్న్ అవుతూ పిచ్ మందకొడిగా మారుతుంటుందని తొలుత బ్యాటింగ్ ఎంపిక చేస్తారు. అంతేగాక భారత్‌లో నాలుగో ఇన్నింగ్స్ ఛేదన అంటే అత్యంత ప్రమాదకరం.

గణాంకాలు కూడా ఇదే చెబుతున్నాయి. తొమ్మిదేళ్ల తర్వాత స్వదేశంలో టెస్టుల్లో భారత కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం ఇదే ప్రథమం. 2015లో బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా ఒక్క రోజు మాత్రమే ఆట కొనసాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక కాన్పూర్‌లోని 24 టెస్టుల చరిత్రలో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి.
1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో చివరిగా బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 559/8 డిక్లేర్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. 266 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది.
అయితే గురువారం రాత్రి వర్షం పడటం, ఇవాళ మేఘావృతమైన వాతావరణం ఉండటంతో రోహిత్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాక బంగ్లాదేశ్ బలమైన ప్రత్యర్థి కాకపోవడంతో ప్రతికూలత పరిస్థితుల్లో మ్యాచ్‌ను గెలవడాన్ని ఆస్వాదించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రోహిత్ నిర్ణయంతో రికార్డులు నమోదయ్యాయి. భారత్‌లో వరుస టెస్టుల్లో బౌలింగ్ ఎంచుకోవడం చరిత్రలో ఇది రెండోసారి.చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ కూడా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. 1997లో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్, శ్రీలంక జట్లు కూడా వరుసగా బౌలింగ్ ఎంచుకున్నాయి.