సుదీర్ఘ విరామం అనంతరం టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ సత్తాచాటుతున్నాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ధనాధన్ షాట్లతో అలరిస్తున్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందిస్తున్నాడు.
పంత్ (82 బ్యాటింగ్; 108 బంతుల్లో, 9 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు శుభ్‌మన్ గిల్ (86 బ్యాటింగ్; 137 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో మూడో రోజు ఆటలో లంచ్ విరామానికి భారత్ 205/3 స్కోరుతో పటిష్టస్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 81/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన పంత్, గిల్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తున్నారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూ బౌండరీ, సిక్సర్లతో స్కోరుబోర్డు ముందుకు నడిపిస్తున్నారు.

ఇద్దరూ అర్ధశతకాలు అందుకుని శతకం దిశగా పయనిస్తున్నారు. 79 బంతుల్లో గిల్, 88 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ సాధించారు. అయితే 50 మార్క్‌ను దాటిన తర్వాత పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతున్నాడు. మెహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో పంత్ ఒంటి చేత్తో బాదిన సిక్సర్ ఇవాళ ఆటలో హైలైట్. అయితే ఈ క్రమంలో పంత్ అరుదైన ఘనత సాధించాడు.
టెస్టు ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్ ఏడో స్థానానికి ఎగబాకాడు. సౌరవ్ గంగూలీ (57 సిక్సర్లు)ను వెనక్కి నెట్టి ఓ స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. పంత్ 34 టెస్టుల్లోనే 58 సిక్సర్లు సాధించడం విశేషం. ఇక ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (90 సిక్సర్లు),రోహిత్ శర్మ (84), ఎంఎస్ ధోనీ (78), సచిన్ టెండూల్కర్ (69), రవీంద్ర జడేజా (66), కపిల్ దేవ్ (61) పంత్ ముందు ఉన్నారు.
ఇక స్వదేశంలో పంత్ ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోరు సాధించడం ఇది ఎనిమిదో సారి. 632 రోజుల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్ అదరగొడుతున్నాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదం అనంతరం రిషభ్ పంత్ ఆటకు దాదాపు 15 నెలలు దూరమైన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్‌తో టీమిండియాలో పురాగనమం చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో హిట్ అయిన పంత్ శ్రీలంక పర్యటనతో వన్డే ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ పునరగామనం చేశాడు.