చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడో రోజు ఆటలో టీ విరామానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. షాద్మాన్ ఇస్లామ్ (21 బ్యాటింగ్), జకీర్ హసన్ (32 బ్యాటింగ్) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. విజయానికి బంగ్లా 459 పరుగులు, టీమిండియా 10 వికెట్ల దూరంలో ఉంది.
అంతకుముందు శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్; 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్ (109; 128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో కదం తొక్కడంతో.. రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లోని 227 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగలు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఓవర్‌నైట్ స్కోరు 81/3తో ఆటను ఆరంభించిన పంత్, గిల్ సాధికారికంగా ఆడారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూ బౌండరీ, సిక్సర్లతో స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. పంత్ 124 బంతుల్లో, గిల్ 161 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నారు. అయితే ఇవాళ ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంత్ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. క్రీజులో ఉన్న పంత్ బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెటప్ చేశాడు.
గిల్-పంత్ ధాటికి బంగ్లాదేశ్ ఫీల్డర్లు నిస్సహాయంగా కనిపించారు. దీంతో పంత్ వాళ్లలో ఉత్సాహాన్ని నింపాడు. 'అరె.. ఒకరు ఇటు వైపు రండి, మరొకరు అటు వైపు వెళ్లండి. ఒకరు ఇక్కడ, మరొకరు మిడ్ వికెట్ వద్దకు వెళ్లండి' అని బంగ్లా ఫీల్డర్లకు సలహాలు ఇచ్చాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో కూడా పంత్ మాట విని ఒక ఫీల్డర్‌ను మిడ్ వికెట్ వద్ద సెట్ చేయడం గమనార్హం. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ కూడా ఇదే తరహాలో వాళ్లకు ఫీల్డింగ్ సెటప్‌లో సహాయం చేశాడు.
కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86) సత్తాచాటారు. హసన్ మహ్మద్ (5/83) అయిదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్.. జస్‌ప్రీత్ బుమ్రా (4/50), ఆకాశ్‌దీప్ (2/19), రవీంద్ర జడేజా (2/19), మహమ్మద్ సిరాజ్ (2/30)ల ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. షకిబ్ అల్ హసన్ (32) టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 227 పరుగుల ఆధిక్యం దక్కింది.