భారత్-బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియానే ఫేవరేట్ అయినప్పటికీ, పాకిస్థాన్‌ను వాళ్ల సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయడంతో సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత్‌ను దీటుగా ఎదుర్కొంటుందా, పాకిస్థాన్‌ను ఓడించినట్లేగానే టీమిండియాకు బంగ్లాదేశ్ షాక్ ఇస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు భారత తుదిజట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది. ఇక తొలి టెస్టు వేదిక అయిన చెపాక్ కూడా సాధారణంగా స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్‌నా లేదా కుల్‌దీప్ యాదవ్‌ను ఎంపిక చేస్తారా అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతోంది.

అయితే స్టార్ ఆలౌరౌండర్ రవీంద్ర జడేజా వరల్డ్ రికార్డుపై కన్నేశాడు. మరో ఆరు వికెట్లు సాధిస్తే అరుదైన జాబితాలో చోటు సంపాదిస్తాడు. టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు, 3000+ పరుగులు సాధించిన భారత మూడో ఆల్‌రౌండర్‌గా జడేజా చరిత్రకెక్కుతాడు. ఓవరాల్‌లా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 11వ ఆల్‌రౌండర్‌గా రికార్డు సాధిస్తాడు.
జడేజా 72 టెస్టుల్లో 3036 పరుగులు, 294 వికెట్లు తీశాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన క్రికెట్లు కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్. కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు, 5248 పరుగులు చేశాడు. అశ్విన్ 100 టెస్టుల్లో 516 వికెట్లు, 3309 పరుగులు సాధించాడు. ఇక ఈ రికార్డు సాధించిన ప్రపంచ స్టార్ ప్లేయర్లలో... ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఉన్నాడు. వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 3154 పరుగులు చేశాడు.
అలాగే ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ (167 టెస్టుల్లో 604 వికెట్లు, 3662 పరుగులు), ఇంగ్లండ్ ప్లేయర్ ఇయాన్ బోథమ్ (102 టెస్టుల్లో 383 వికెట్లు, 5200 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్టుల్లో 431 వికెట్లు, 3124 పరుగులు), న్యూజిలాండ్ ప్లేయర్ డేనియల్ వెటోరి (113 టెస్టుల్లో 362 వికెట్లు, 4531 పరుగులు),
దక్షిణాఫ్రికా ఆటగాడు షాన్ పొలాక్ (108 టెస్టుల్లో 421 వికెట్లు, 3781 పరుగులు), పాకిస్థాన్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్ (88 టెస్టుల్లో 362 వికెట్లు, 3807 పరుగులు), శ్రీలంక ప్లేయర్ చమిందా వాస్ (111 టెస్టుల్లో 355 వికెట్లు, 3089 పరుగులు) ఉన్నారు.