చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. మరో ఆరు వికెట్లు సాధిస్తే గెలుపు లాంఛనమవుతుంది. రవిచంద్ర్ అశ్విన్ (3/63) ధాటికి.. మూడో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. విజయానికి బంగ్లాదేశ్ 357 పరుగుల దూరంలో ఉంది.
చేతిలో ఆరు వికెట్లతో మిగిలిన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించడం కష్టమే. ఆదివారం తొలి సెషన్ ముగిసేసరికే బంగ్లా కథ ముగిసిపోయే అవకాశం ఉంది. కొత్త బంతితో భారత్ బౌలర్లను కాచుకోవడం బంగ్లా బ్యాటర్లకు అతి పెద్ద సవాలే. దాంతో మిగిలిన రెండు రోజులు డ్రా కోసం పోరాడే ఆలోచన కూడా బంగ్లాదేశ్ జట్టుకు రాదు. ఓటమి అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా రేపు బరిలోకి దిగవచ్చు.

అయితే భారత్ విజయానికి వరుణుడు అడ్డుపడేలా ఉన్నాడు. శనివారం మరో 9.4 ఓవర్లు పాటు ఆట కొనసాగాల్సి ఉంది. కానీ వెలుతురులేమితో మూడో రోజు ఆటను కాస్త తొందరగా ముగించారు. దానికి కారణం వరుణుడే. మేఘూలు కమ్ముకోవడంతో ఇవాళ ఆట త్వరగా ముగిసింది. అయితే ఆదివారం, సోమవారం వర్షం పడే అవకాశం ఉంది. అలా అనీ భారీ వర్ష సూచన లేదు. కానీ ఆటకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
ఇప్పటికే పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ మంచి లయలో ఉన్నారు. మరోవైపు క్రీజులో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (51 బ్యాటింగ్; 60 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షకిబ్ అల్ హసన్ (5; 14 బంతుల్లో) ఉన్నారు. వీరిద్దరు సీనియర్లు అయినప్పటికీ భారత బౌలర్లను ఎదుర్కొని జట్టును ఓటమి నుంచి కాపాడం దాదాపు అసాధ్యమే. మిగిలిన రెండు రోజుల ఆటలో కనీసం రెండు సెషన్లు ఆట కొనసాగినా టీమిండియాదే విజయం ఖాయమవుతుంది.
దీంతో బంగ్లా ఓటమి తప్పించుకోవాలంటే వర్షం ఒక్కటే మార్గం. కాగా, వరుణుడు ఫలితంపై ప్రభావం చూపిస్తాడేమో అనే అనుమానంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త త్వరగానే సెకండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. కేఎల్ రాహుల్ (22 నాటౌట్) అర్ధశతకం, గిల్ 150 మార్క్ కోసం ఎదురుచూడలేదు. ఓవర్‌నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్; 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్ (109; 128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలు సాధించారు.
కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86) సత్తాచాటారు. హసన్ మహ్మద్ (5/83) అయిదు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. షకిబ్ అల్ హసన్ (32) టాప్ స్కోరర్. జస్‌ప్రీత్ బుమ్రా (4/50) నాలుగు వికెట్లు తీశాడు.