చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు భారత్‌దే ఆధిప్యతం.అయితే తొలి రెండు సెషన్ల వరకు పర్యాటక జట్టు బంగ్లాదే పైచేయి. ఊహించినట్లుగానే పాకిస్థాన్‌ను వైట్ వాష్ చేసిన నయా ఉత్సాహంతో తొలి రోజు ఆటను బంగ్లా గొప్పగా ప్రారంభించింది. హసన్ మహ్మద్ ధాటికి భారత్ 34/3తో కష్టాల్లో పడింది. కానీ యశస్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు), రిషబ్ పంత్ (39; 52 బంతుల్లో 6 ఫోర్లు) సాయంతో భారత్ తిరిగి పుంజుకుంది.
కానీ బంగ్లా బౌలర్లు మరోసారి చెలరేగి టీమిండియాను 144/6కు కట్టడి చేశారు. దీంతో భారత్ 250 దాటడం కష్టమే అని భావించారంతా. కానీ అప్పుడు క్రీజులోకి అడుగుపెట్టిన రవిచంద్రన్ అశ్విన్ (102 బ్యాటింగ్; 112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చాడు. రావడంతోనే ధాటిగా బ్యాటింగ్ మొదలుపెట్టాడు. అతను ఆడే కట్, లాఫ్టెడ్ షాట్లను చూసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఆశ్చర్యంగా చూశాడు.

మరోవైపు రవీంద్ర జడేజా (86 బ్యాటింగ్; 117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తగ్గేదేలా అన్నట్లుగా చెలరేగాడు. అశ్విన్‌కు సహకరిస్తూ పరుగుల మోత మోగించాడు. వీరిద్దరు పోటాపోటీగా పరుగులు చేయడంతో బంగ్లా బౌలర్లు నిస్సహాయులుగా మారిపోయారు. గతి తప్పి బంతులు సంధించారు. జడేజా-అశ్విన్ అభేద్యంగా ఏడో వికెట్‌కు 195 పరుగులు జోడించడంతో.. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ 339/6తో మెరుగైన స్థితిలో నిలిచింది.
అయితే అశ్విన్-జడేజా బ్యాటింగ్ చూస్తుంటే సగటు క్రికెట్ అభిమానిని ఓ ప్రశ్న వెంటాడుతోంది. వీరిద్దరు బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం కంటే తమ ఉనికిని చాటుకోవాలనే ఆకాంక్ష కనిపిస్తుంది. దానికి కారణం ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్ అని తెలుస్తోంది. నవంబర్‌లో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
అయితే ఆస్ట్రేలియా పిచ్‌లపై భారత తుదిజట్టులో ఒక్క స్పిన్నర్‌కే అవకాశం లభిస్తుంది. ఈ ఒక్క స్థానంలో తామే అత్యుత్తమం అన్నట్లుగా గురువారం అశ్విన్-జడేజా బ్యాటింగ్ చేస్తున్నట్లు ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో ఆడిన టెస్టు తుది జట్టులో వరల్ట్ టెస్టు నంబర్ వన్ బౌలర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ బెంచ్‌కే పరిమితమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సైతం అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించులేకపోయాడు.
అశ్విన్‌కు బదులుగా బంతితో పాటు బ్యాటుతో సత్తాచాటే జడేజాకే అవకాశాలు ఇచ్చారు. దీంతో అశ్విన్ కసిగా బ్యాటింగ్ చేస్తున్నాడని, మరోవైపు యాష్‌కు దీటుగా జడ్డూ కూడా పోటీగా పరుగులు సాధిస్తున్నాడని నెటిజన్ల వాదన. ఇద్దరూ ఇలా ఒకరినొకరు సహకరించుకుంటూ పోటీపడటం భారత్‌కే కలిసొస్తుందని మరికొందరు సంబరపడుతున్నారు. అయితే అశ్విన్-జడేజా ఇలానే ఆల్‌రౌండ్ షోతో గొప్పగా సత్తాచాటితే ఆస్ట్రేలియా పర్యటనలో తుది జట్టు ఏకైక స్పిన్నర్ స్థానానికి ఎంపికలో గంభీర్-రోహిత్ శర్మకు పెద్ద తలనొప్పిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.