మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి 86 పరుగుల పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇక మూడు టీ20ల సిరీస్‌లో మిగిలిన నామమాత్రపు ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీస్కోర్ చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి(74; 34 బంతుల్లో, 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్(53; 29 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. హార్దిక్ పాండ్య (32; 19 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్లా(41; 39 బంతుల్లో, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.
అయితే ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య మూడు క్యాచ్‌లతో బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. రిషద్ హొస్సేన్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌లో హార్దిక్ అందుకున్న తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రిషద్ భారీ షాట్‌కు యత్నించాడు. డీప్ మిడ్‌వికెట్‌లో ఉన్న హార్దిక్ తన ఎడమవైపునకు చిరుతలా ఏకంగా రెప్పపాటులో 27 మీటర్లు పరిగెత్తాడు. బౌండరీ లైన్‌ను గమనిస్తూ, బంతిని అంచనా వేస్తూ అద్భుతంగా రన్నింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.