టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ టీ20 సిరీస్‌నూ ఘనంగా బోణీ కొట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యాన్ని 12 ఓవర్లలోపే ఛేదించి మ్యాచ్‌ను రికార్డు వేగంతో ముగించింది. టీ20ల్లో 100+ లక్ష్యాన్ని భారత్ త్వరగా ముగించిన మ్యాచ్ ఇదే.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్‌దీ హసన్ మీరాజ్(35 నాటౌట్; 32 బంతుల్లో, 3 ఫోర్లు), నజ్ముల్ హెస్సేన్ షాంటో(27; 25 బంతుల్లో, ఫోర్, సిక్సర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్‌దీప్ సింగ్(3/14) చెరో మూడు వికెట్లు, మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్య(1/26), వాషింగ్టన్ సుందర్(1/12)తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలుపొందింది. హార్దిక్ పాండ్య (39 నాటౌట్; 16 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (29; 14 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శాంసన్(29; 19 బంతుల్లో, 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లు తలో వికెట్ తీశారు.
అయితే తస్కిన్ అహ్మద్ వేసిన బంతిని సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించిన హార్దిక్ పాండ్య అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున సిక్సర్‌తో అత్యధిక మ్యాచ్‌లను ముగించిన ప్లేయర్‌గా హార్దిక్ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌తో కలిపి హార్దిక్ అయిదు సార్లు సిక్సర్‌తో ఫినిష్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ఎంఎస్ ధోనీ, రిషభ్ పంత్ ఉన్నారు. వీరిద్దరు చెరో మూడు సార్లు సిక్సర్‌తో ముగించారు. ఇక ఏ భారత బ్యాటర్ రెండు సార్లు లేదా అంత కంటే ఎక్కువసార్లు సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించలేదు.