భారత్-బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియానే ఫేవరేట్ అయినప్పటికీ, పాకిస్థాన్‌ను వాళ్ల సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయడంతో సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత్‌ను దీటుగా ఎదుర్కొంటుందా, పాకిస్థాన్‌ను ఓడించినట్లేగానే టీమిండియాకు బంగ్లాదేశ్ షాక్ ఇస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు భారత తుదిజట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది. సర్ఫరాజ్ ఖాన్-కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్-రిషభ్ పంత్‌లలో ఎవరికి అవకాశం వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే తొలి టెస్టు భారత తుది జట్టులో ఏఏ బ్యాటర్లకు అవకాశం వస్తుందనే విషయంపై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టత ఇచ్చాడు. మొదటి టెస్టులో సర్ఫరాజ్, ధ్రువ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కదని, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ తుదిజట్టులో ఉంటారని గంభీర్ చెప్పాడు. అయితే అవకాశం దక్కకపోతే వాళ్లను తప్పించినట్లు కాదని, తుదిజట్టు కూర్పుకు తగ్గట్లుగా ఎంపిక చేసినట్లుగా భావించాలని తెలిపాడు.
''మేం ఎవరిని తప్పించం. తుదిజట్టు కూర్పుకు తగ్గట్లుగా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తాం. ధ్రువ్ జురెల్ అద్భుతమైన ప్లేయర్. కానీ పంత్ తిరిగి జట్టులోకి రావడంతో కొందరు స్థానం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ఇదే పరిస్థితి. అవకాశాలు వస్తాయి. దాని కోసం ఎదురుచూడాలి''
''పంత్ ఎంతటి విధ్వంసకర బ్యాటరో, అతను ఏం చేయగలడో మనకందరికీ తెలుసు. అతని వయస్సులో చాలా మంది అన్ని పరిస్థితుల్లో అలా ఆడలేరు. అతని బ్యాటింగ్, వికెట్ కీపింగ్ అద్భుతంగా ఉంటుంది. అతని బ్యాటింగ్ నీడలో తన నాణ్యమైన వికెట్ కీపింగ్ కనిపించట్లేదు'' అని గౌతమ్ గంభీర్ అన్నాడు.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్