చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. మొదట బ్యాటుతో చెలరేగిన టీమిండియా తర్వాత బంతితో విజృంభిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 339/6తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్
తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (113; 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. రవీంద్ర జడేజా (86; 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) గొప్పగా పోరాడాడు.
యశస్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు), రిషబ్ పంత్ (39; 52 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ (5/83) వికెట్లతో మెరిశాడు. తస్కిన్ అహ్మద్ మూడు (3/55) వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ను స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. బుల్లెట్‌లా వేసిన ఆఖరి బంతికి బంగ్లా ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ (2) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

అయితే షాద్మాన్‌ను బుమ్రా తెలివిగా బోల్తాకొట్టించాడు. మొదటి అయిదు బంతుల్ని ఓవర్ ది వికెట్‌గా వేశాడు. అంతేగాక ఔట్ స్వింగర్స్‌తో బ్యాటర్‌ను ఇబ్బందిపెట్టాడు. కానీ ఆఖరి బంతిని రౌండ్ ది వికెట్‌గా బౌలింగ్ చేశాడు. మరోవైపు షాద్మాన్ చివరి బాల్ కూడా ఔట్ స్వింగర్ అవుతుందేమో అని భ్రమపడి డిఫెండ్‌కు ప్రయత్నించలేదు. కానీ బుమ్రా యాంగిల్‌ను మార్చి బంగ్లా ఓపెనర్‌ను బిత్తరపోయేలా చేశాడు.
ఇక ఆకాశ్ దీప్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో రెండో రోజు ఆటలో లంచ్ విరామానికి బంగ్లాదేశ్ 9 ఓవర్లకు 26/3 స్కోరుతో కష్టాల్లో పడింది. తొమ్మిదో ఓవర్ తొలి బంతికి జకీర్ హసన్ (3)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్.. తర్వాతి బంతికి మోమినుల్‌ను గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆకాశ్ దీప్‌కు హ్యాట్రిక్ దక్కకుండా ముష్ఫికర్ మూడో బంతిని అడ్డుకున్నాడు. కాగా, రెండో రోజు ఆటలో మొదటి సెషన్‌లో ఏడు వికెట్లు పడ్డాయి. అన్ని వికెట్లను ఫాస్ట్ బౌలర్లే తీయడం విశేషం. బంగ్లా బౌలర్లలో తస్కిన్ మూడు, హసన్ ఒక్క వికెట్ తీయగా, ఆకాశ్ రెండు, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. బంగ్లాదేశ్ ఇంకా 350 పరుగుల వెనుకంజలో ఉంది.