
ఆరంభం అదిరిపోయినా..
వర్షం అంతరాయాన్ని కలిగించిన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా తడపడింది. వెంటవెంటనే ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు అద్దిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ- దాన్ని కాపాడుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. టీమిండియా పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 60, మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 21 పరుగులు చేశారు.

వరుసగా వికెట్లు..
ఆ తరువాత వచ్చిన టాప్ ఆర్డర్ బ్యాటర్లెవరూ కుదురుగా క్రీజ్‌లో నిల్చోలేదు. కేప్టెన్ షకీబుల్ హసన్ 13 పరుగులకే వెనుదిరిగాడు. అఫీఫ్ హొస్సేన్-3, యాసిర్ అలీ-1, మొసాద్దెక్ హొస్సేన్-6 పరుగులకే పెవిలియన్ చేరారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు కూల్చాడు. హార్దిక్ పాండ్యా, షమీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. వికెట్ కీపర్ నూరుల్ హసన్-25, తస్కిన్ అహ్మద్-12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

16 ఓవర్లల్లో..
డక్‌వర్త్ లూయిస్ విధానంలో బంగ్లాదేశ్- 16 ఓవర్లల్లో 150 పరుగులు చేయాల్సి ఉండగా.. 145 వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం. 16 ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విసిరిన థ్రో.. హైలైట్. జోరు మీదున్న లిట్టన్ దాస్‌ను కేఎల్ రాహుల్ రనౌట్ చేసిన తీరు అద్భుతం. అతను సంధించిన డైరెక్ట్ థ్రోకు లిట్టన్ బలి అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ సంధించిన ఎనిమిదో ఓవర్ రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు లిట్టన్.

ఆ థ్రో అద్భుతం..
రెండో రన్ కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి క్రీజ్‌కు చేరుకునే లోపే కేఎల్ రాహుల్ సంధించిన డైరెక్ట్ థ్రో- వికెట్లను గిరాటేసింది. రనౌట్ నుంచి కాపాడుకోవడానికి లిట్టన్ డైవ్ కొట్టినా ఉపయోగం లేకుండా పోయింది. మొన్నటి వరకూ తీవ్రంగా విమర్శలను ఎదుర్కొన్న కేఎల్ రాహుల్‌కు ఊపిరి పోసిందీ మ్యాచ్. తొలుత బ్యాటింగ్‌లో.. అనంతరం మెరుపు ఫీల్డింగ్‌తో కట్టిపడేశాడు. 32 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో సరిగ్గా హాఫ్ సెంచరీ చేశాడు.
అరిపించిన అర్ష్‌దీప్
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మెరిశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీనితో టీ20 ప్రపంచకప్ 2022లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా దూసుకెళ్తోన్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో తొమ్మిది వికెట్లను కూల్చాడు అర్ష్‌దీప్. ప్రస్తుతం హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రమ్ నిలవగా.. అతని సరసన చేరాడు. పాకిస్తాన్-3, నెదర్లాండ్స్-2, దక్షిణాఫ్రికా-2 వికెట్లను తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రెండు వికెట్లు కూల్చాడు.
నాడు విలన్‌గా
టర్బొనేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వారసుడిగా పేరు తెచ్చుకుంటోన్నాడు అర్ష్‌దీప్ సింగ్. ఆసియా కప్ 2022లో అర్ష్‌దీప్ సింగ్ పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడిగా చెడ్డ పేరు అపాదించుకున్నాడు. క్యాచ్‌ను వదిలేయడం ద్వారా ఖలిస్తానీ ముద్రను కూడా వేయించుకున్నాడు. ఆ తరువాతి మ్యాచ్‌లన్నింట్లోనూ జట్టును గెలుపు బాట పట్టించడంలో కీలక పాత్ర పోషిస్తోన్నాడు.


Click it and Unblock the Notifications












