సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్‌తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. కాగా, ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి సత్తాచాటడానికి ప్రయత్నిస్తాడని, అయితే అతను తక్కువ పరుగులు చేయాలని కోరుకుంటున్నాని ట్రావిస్ హెడ్ అన్నాడు.

''విరాట్ కోహ్లి చాలా గొప్ప ప్లేయర్. ఎక్కడికి వెళ్లినా అతని గురించే మాట్లాడుకుంటారు. భారత్‌తో సిరీస్ అంటే కోహ్లి గురించి మాట్లాడకుండా ఉండలేం. భారత ఆటగాళ్లందరితోనూ మాకు పోటీనే. అయితే ఈ సిరీస్‌లో కోహ్లి గొప్పగా సత్తాచాటతాడని భావిస్తున్నా. అయితే అతను మరీ అంత ఎక్కువగా పరుగులు చేయొద్దని ఆశిస్తున్నా. అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్. అయిదు టెస్టుల సిరీస్‌లో ఏదో ఒక దశలో కోహ్లి కచ్చితంగా గొప్పగా రాణిస్తాడు. దాన్ని అర్థం చేసుకుని, మనం గౌరవించాలి'' అని ట్రావిస్ హెడ్ పేర్కొన్నాడు.

కాగా, విరాట్ కోహ్లి ఫామ్‌పై ఇటీవల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ వ్యాఖ్యలు ప్రాధానత్యం సంతరించుకున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లి 15.50 సగటుతో 93 పరుగులే చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సాధించిన 70 పరుగుల మినహాయిస్తే .. కోహ్లి సగటు అత్యంత దారుణంగా ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాలో కోహ్లి 13 టెస్టుల్లో 54.08 సగటుతో 1352 పరుగులు సాధించాడు. ఆరు సెంచరీలు బాదాడు.