IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రమంగా కోలుకుంటోంది. వెంటవెంటనే ఆరు వికెట్లను పడగొట్టుకున్న తరువాత కుదురుకుంటోంది. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతోంది. టీ బ్రేక్ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు తన ఖాతాలో వేసుకుంది. భారత్‌పై 240 పరుగుల ఆధిక్యతను సాధించింది.
టీమిండియా పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ధాటికి వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. సామ్ కొన్‌స్టాస్- 8, ఉస్మాన్ ఖవాజా- 21, స్టీవెన్ స్మిత్- 13, ట్రావిస్ హెడ్- 1, మిఛెల్ మార్ష్- 0, వికెట్ కీపర్ బ్యాటర్- అలెక్స్ క్యారీ- 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొత్తంగా 91 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా.

మార్నుస్ లాబుషేన్ ఒంటరి పోరాటం సాగిస్తోన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొని క్రీజ్‌లో నిలిచాడు. అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ విరామానికి 65 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ 21 పరుగులతో అతనికి సహకారం అందిస్తోన్నాడు.
ఈ సెషన్‌లో యశస్వి జైస్వాల్ విలన్‌గా నిలిచాడు. బ్యాక్ అండ్ బ్యాక్ క్యాచ్‌లను జారవిడిచాడు. ఫలితంగా మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు టర్న్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి ఏర్పడింది. రెండుసార్లు లాబుషేన్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. 46 పరుగుల మీద అతను ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు యశస్వి జైస్వాల్.
మహ్మద్ సిరాజ్ సంధించిన బంతి అది. అతని నుంచి వెలువడిన డెలివరీని షాట్ ఆడటానికి ప్రయత్నించాడు లాబుషెన్. బంతి అనూహ్యంగా బౌన్స్ అయింది. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సిల్లీ పాయింట్ వైపు గాల్లోకి ఎగిరింది. చాలా సింపుల్ క్యాచ్ అది. ఏ మాత్రం జారవిడవడానికి అవకాశమే లేని సునాయాస క్యాచ్.
ఆ తరువాత పాట్ కమ్మిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. ఆకాష్ దీప్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడాడు కమ్మిన్స్. మిడిల్ ఆఫ్ ది బ్యాట్ తీసుకుని టర్న్ అయిందా డెలివరీ. సిల్లి పాయింట్ వైపు గాల్లోకి లేచింది. దాన్ని అందుకోవడంలో విఫలం అయ్యాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో కనిపించారా సమయంలో.