ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుస్తుందని స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా ఫేవరేట్ అని, మన జట్టుతో పోటీ అంటే ఆస్ట్రేలియానే ఆందోళన చెందుతుందని షమి అన్నాడు. అయిదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన వెళ్లనుంది.
2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో పాటు ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌దే పైచేయి. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది. ఇక గత ఆస్ట్రేలియా పర్యటన భారత టెస్టు చరిత్రలో నిలిచిపోయింది. తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుని 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

కాగా, మహ్మద్ షమి తన పునరాగమనం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ అనంతరం చీలమండల గాయంతో షమి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి, ఫార్మాట్ గురించి ఆలోచిస్తూ రీఎంట్రీ ఇవ్వనని, 100 శాతం ఫిట్‌నెస్ సాధించిన సమయానికి దేశవాళీ టోర్నీలు జరిగితే, ఆ టోర్నీలో అయినా పునరాగమం చేస్తానని షమి చెప్పాడు.
''వీలైనంత త్వరగా రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. అయితే పునరాగమనం సమయానికి నేను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలి. అప్పుడే మరోసారి గాయపడకుండా ఉండగలను. ఇక బంగ్లాదేశ్ సిరీస్‌తోనా, న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియా సిరీస్‌తో రీఎంట్రీనా అనేది మ్యాటర్ కాదు. ప్రత్యర్థి, ఫార్మాట్‌తో పునరాగమనం సంబంధం లేదు. దేశవాళీ క్రికెట్ ఆడాల్సి వచ్చినా నేను ఆడతాను. ఇక నేను బౌలింగ్ చేయడం ప్రారంభించాను. అయితే నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. 100 శాతం ఫిటెనెస్ సాధిస్తేనే రీఎంట్రీ ఇస్తా'' అని షమి అన్నాడు.
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల జరగనుంది. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌కు షమి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.