
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న టీమిండియా.. ఆ దేశ జట్టుతో తొలి వామప్ మ్యాచ్ ఆడుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపు దిశగా పయనిస్తోంది. 14 ఓవర్లల్లో రెండు వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. ఓపెనర్ మిఛెల్ మార్ష్-35, టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్-11 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆడుతున్నాడు.
టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్‌ను ఆరంభించారు. ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై అటాక్‌కు దిగారు. ప్రత్యేకించి- కేఎల్ రాహుల్ చెలరేగాడు. 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు, ఆరు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుని పడ్డాడు.
కేఎల్ రాహుల్ తరువాత టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై అడుగు పెట్టినప్పటి నుంచీ నిలకడగా భారీ ఇన్నింగ్ ఆడుతోన్నాడీ మహారాష్ట్రియన్. ఈ వామప్‌తో కలుపుకొని ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో భారీ స్కోర్ సాధించాడు. చివరి మూడు మ్యాచ్‌లల్లో 25 బంతుల్లో 46, 0, 36 బంతుల్లో 69, 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
దీనితో టీ20 ప్రపంచకప్‌లో అతని మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి అనుగుణంగా ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2022లో బెస్ట్ బ్యాటర్ అతనొక్కడేనని వ్యాఖ్యానించాడు. నిఖార్సయిన టెక్నిక్‌తో బౌలర్లపై ఎదురుదాడికి దిగుతుంటాడని పేర్కొన్నాడు. ఖచ్చితమైన టైమింగ్‌తో బంతిని మిడిల్ ఆఫ్ ది బ్యాట్ ఆడే బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా అభివర్ణించాడు.
ఆస్ట్రేలియా బౌలర్లల్లో కేన్ రిచర్డ్‌సన్ ఒక్కడే రాణించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. మిఛెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అష్టన్ అగర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. చివరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను రిచర్డ్‌సన్ కాట్ అండ్ బౌల్డ్‌గా అవుట్ చేశాడు.