
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న టీమిండియా.. ఆ దేశ జట్టుతో తొలి వామప్ మ్యాచ్ ఆడుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:30 గంటలకు ఆరంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ అదర గొడుతోంది. భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. అర్ధసెంచరీలతో సత్తా చాటారు.
టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్‌ను ఆరంభించారు. ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై అటాక్‌కు దిగారు. ప్రత్యేకించి- కేఎల్ రాహుల్ చెలరేగాడు. 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు, ఆరు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుని పడ్డాడు. 4,0,6,4,2,4తో 20 పరుగులు పిండుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో విజృంభించాడు. 33 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై అడుగు పెట్టినప్పటి నుంచీ నిలకడగా భారీ ఇన్నింగ్ ఆడుతోన్నాడీ మహారాష్ట్రియన్. ఈ వామప్‌తో కలుపుకొని ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో భారీ స్కోర్ సాధించాడు. చివరి మూడు మ్యాచ్‌లల్లో 25 బంతుల్లో 46, 0, 36 బంతుల్లో 69, 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 50 పైగా బ్యాటింగ్ యావరేజ్‌ను నమోదు చేస్తోన్నాడు. దీనితో టీ20 ప్రపంచకప్‌లో అతని మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇవ్వాళ్టి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పెర్ఫార్మెన్స్ లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్‌ను కట్టిపడేసింది. అతణ్ని మిస్టర్ 360గా అభివర్ణించారు గవాస్కర్. టీమిండియాకు సరి కొత్త మిస్టర్ 360 దొరికాడనీ వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తరువాత ఆ స్థాయిలో సూర్య ఆడుతున్నాడని, నిలకడగా రాణించడం అతని సొంతమని పేర్కొన్నాడు. డివిలియర్స్ తరహాలో గ్రౌండ్‌కు నలువైపులా బంతిని తరలించగల టెక్నిక్ అతనికి ఉందని కితాబిచ్చాడు.