
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న టీమిండియా.. ఆ దేశ జట్టుతో తొలి వామప్ మ్యాచ్ ఆడుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:30 గంటలకు ఆరంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ అదర గొడుతోంది. భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తోన్న సమయంలో ఆసీస్ బౌలర్లు టీమిండియా దూకుడుకు బ్రేక్ వేశారు. వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. కేప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్‌ను ఆరంభించారు. ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై అటాక్‌కు దిగారు. ప్రత్యేకించి- కేఎల్ రాహుల్ చెలరేగాడు. 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు, ఆరు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్.. తక్కువ బంతులను ఎదుర్కొనాల్సి వచ్చింది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోనే ఎక్కువగా కనిపించాడు హిట్ మ్యాన్.
స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించే బాధ్యతను కేఎల్ రాహుల్ తీసుకున్నాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుని పడ్డాడు. 4,0,6,4,2,4తో 20 పరుగులు పిండుకున్నాడు. 7, 8 ఓవర్లల్లో ఆస్ట్రేలియాకు బ్రేక్ త్రూ లభించింది. 7వ ఓవర్ మూడో బంతికి కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హాఫ్-ట్రాకర్ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడబోయి అగర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు రాహుల్.
ఆ మరుసటి ఓవర్‌లోనే మరో వికెట్ పడింది. అగర్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ. మిడిల్ స్టంప్ దిశగా దూసుకొచ్చిన బంతిని స్వీప్ చేయబోయి టైమింగ్ మిస్ అయ్యాడు. గాల్లోకి ఎగిన బంతి కాస్తా డీప్ మిడ్ వికెట్‌లో కాచుక్కూర్చున్న మ్యాక్స్‌వెల్ చేతిలో వాలింది. ప్రస్తుతం టాప్ ఆర్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో ఉన్నారు. కోహ్లీ-15, సూర్యకుమార్ యాదవ్-23 పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది టీమిండియా.