సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకోగలదు.
మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్‌తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. దీంతో సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే ప్రాక్టీస్‌లో భారత ఆటగాళ్లకు వరుసగా గాయాలవుతున్నాయి. సిమ్యులేషన్ సెషన్‌లో ప్రసిధ్ కృష్ణ వేసిన బంతికి కేఎల్ రాహుల్ కుడిచేతికి గాయమైంది. ఫిజియో చికిత్స అనంతరం రాహుల్ బ్యాటింగ్ కొనసాగించాలనుకున్నాడు.

కానీ నొప్పి తీవ్రత, సుదీర్ఘ సిరీస్ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొని కేఎల్ రాహుల్ మైదానాన్ని వీడాడు. మరోవైపు విరాట్ కోహ్లికి కూడా గాయమైందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. అంతేగాక మిస్టరీ గాయం కోసం కోహ్లి స్కానింగ్‌కు కూడా వెళ్లాడని రాసుకొచ్చింది. కోహ్లి గాయం స్వభావం అనిశ్చితిగా ఉండటంతో స్కానింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. వ్యక్తిగత కారణాలతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు దూరమవుతున్నాడని ప్రచారం సాగుతున్న వేళ.. కీలక ఆటగాళ్లు గాయాలపాలవ్వం టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది.
న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా సిరీస్ కోసం తీవ్రంగా సాధన చేస్తున్నాడు. సిమ్యులేషన్ సెషన్‌లతో పాటు నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. తిరిగి లయను అందుకోవాలని కసిగా ప్రాక్టీస్ చేస్తున్న ఈ క్రమంలో గాయమవ్వడం కోహ్లికే కాకుండా టీమిండియాకు ప్రతికూలమే. కాగా, గత ఆరు టెస్టుల్లో 22 సగటుతోనే పరుగులు చేశాడు. అయితే ఆస్ట్రేలియా పిచ్‌లపై కోహ్లి సగటు 54.08గా ఉంది.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).