ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీఫైనల్ విజయంలో కీలకంగా వ్యవహరించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వేసిన అంచనానే నిజమైంది. ఈ సెమీ ఫైనల్ పోరులో అతడు చెప్పినట్టుగానే కేఎల్ రాహుల్ విషయంలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోహ్లీ అసలేం చెప్పాడంటే?
సెమీఫైనల్ లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ క్రీజులో కుదురుకున్నాక ధాటిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో భారత్ జట్టు వడివడిగా లక్ష్యం దిశగా వెళ్లింది. అయితే ఆ సమయంలోనే సెంచరీ బాదుతాడనుకున్న కోహ్లీ ఔటై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రాహుల్ తో కలిసి హార్దిక్ కూడా బ్యాట్ ఝళిపించడంలో భారత్ లక్ష్యానికి దాదాపుగా చేరుకుంది. కానీ ఆ సమయంలో హార్దిక్ సిక్స్ కొట్టడానికి ప్రయత్నించబోయి ఔటయ్యాడు.

అయితే అప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న భారత ఆటగాళ్లు డల్ అవ్వలేదు కానీ, చివరి ఓవర్ ను కేఎల్ రాహుల్ ఎలా ముగిస్తాడన్న ఆత్రుతతో కనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుండగా, కోహ్లీ నిల్చొని చూస్తున్నాడు. అప్పుడే కోహ్లీ.. రోహిత్ వైపు తిరిగి రాహుల్ కచ్చితంగా అద్భుతమైన సిక్స్ బాదుతాడని చెప్పాడు.
ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ బౌలింగ్ యాక్షన్, రాహుల్ షాట్ బాదుతాడని ఇమిటేట్ చేసి చూపించాడు. విరాట్ చెప్పినట్టుగా కేఎల్ రాహుల్.. మ్యాచ్ ను సిక్స్ తో ముగించాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో భారత ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. రాహుల్ విషయంలో కోహ్లీ అంచనానే నిజమైందిగా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.