అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంలో విరాట్ కోహ్లి తనవంతు కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో చెలరేగాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో 93 పరుగులే చేసి నిరాశపర్చిన కోహ్లి కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు.
అయితే అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టులో కోహ్లి పలు రికార్డులపై కన్నేశాడు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్‌మన్ రికార్డులను బ్రేక్ చేసే యోచనలో ఉన్నాడు. కోహ్లి మరో సెంచరీ సాధిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా కోహ్లి రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డును సచిన్ టెండూల్కర్‌తో కలిసి కోహ్లి సంయుక్తంగా పంచుకున్నాడు. 65 ఇన్నింగ్స్‌ల్లో సచిన్, 44 ఇన్నింగ్స్‌లో కోహ్లి తొమ్మిది సెంచరీలు చేశారు.

సచిన్, కోహ్లి తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్ (8 సెంచరీలు- 51 ఇన్నింగ్స్‌లు), స్టీవ్ స్మిత్ (8 సెంచరీలు- 37 ఇన్నింగ్స్‌లు), మైకేల్ క్లార్క్ (7 సెంచరీలు- 40 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. కాగా, కోహ్లి సెంచరీ చేస్తే డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డు కూడా బద్దలవుతుంది. ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు బ్రాడ్‌మన్ పేరిట ఉంది. ఇంగ్లండ్‌పై ఆయన 11 సెంచరీలు చేశాడు. రెండో స్థానంలో ఉన్న కోహ్లి ఆస్ట్రేలియాపై 10 శతకాలు బాదాడు. తర్వాతి స్థానాల్లో జేబీ హాబ్స్ (9 సెంచరీలు- ఆస్ట్రేలియాపై), సచిన్ (9 సెంచరీలు- శ్రీలంక) ఉన్నారు.
కాగా, రెండో టెస్టులో కోహ్లి మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ వేదికలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా లారా రికార్డును కోహ్లి అధిగమిస్తాడు. అడిలైడ్‌లో లారా 611 పరుగులు చేయగా కోహ్లి 509 పరుగులు చేశాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. పింక్ బాల్‌తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.