అడిలైడ్ వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టు తొలి రోజు భారత్‌పై ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. శుక్రవారం ఆట ముగిసేసరికి ఆసీస్ 33 ఓవర్లకు వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. లబుషేన్ (20 బ్యాటింగ్; 67 బంతుల్లో, 3 ఫోర్లు), నాథన్ మెక్‌స్వీనె (38 బ్యాటింగ్; 97 బంతుల్లో, 6 ఫోర్లు) క్రీజులో కొనసాగుతున్నారు. ఉస్మాన్ ఖవాజా (13; 35 బంతుల్లో, 2 ఫోర్లు)ను బుమ్రా ఔట్ చేశాడు. టీమిండియా కంటే ఆస్ట్రేలియా 94 పరుగుల వెనుకుంజలో ఉంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (42; 54 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (37; 64 బంతుల్లో, 6 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (31; 51 బంతుల్లో, 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (22; 22 బంతుల్లో, 3 ఫోర్లు), రిషభ్ పంత్ (21; 35 బంతుల్లో, 2 ఫోర్లు) రాణించారు. మిగిలిన బ్యాటర్లూ ఎవరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (6/48) ఆరు వికెట్లతో విజృంభించాడు. ప్యాట్ కమిన్స్ (2/41), స్కాట్ బొలాండ్ (2/54) చెరో రెండు వికెట్లు తీశారు.

అయితే మొదటి రోజు ఆట గురించి విశ్లేషిస్తూ భారత బౌలర్ల ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో బౌలర్లతో పోలిస్తే టీమిండియా బౌలర్లు గులాబీ బంతిని అంతగా సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నాడు. ఉచ్చులో చిక్కేలా బంతులు సంధించాలని సూచించాడు. పెర్త్ టెస్టులో ఆసీస్ బ్యాటర్లను బుమ్రా ఔట్ చేసిన తీరులో ఈ డే/నైట్ టెస్టులోనూ చేయాలని గవాస్కర్ తెలిపాడు.
''వీలైనంత వరకు బ్యాటర్లను బంతులు ఎదుర్కొనేలా చేయాలి. అలా ఎదుర్కొనే క్రమంలో మనకు చిక్కుతారు. కొన్ని బంతుల్ని ఔట్ సైడ్ సంధించాలి. ఆ తర్వాత తిరిగి లోపలకు వేయాలి. పెర్త్ టెస్టులో నాథన్ మెక్‌స్వీనె, లబుషేన్‌కు బుమ్రా ఇలానే చేసి వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ఉపయోగించినంత గులాబీ బంతిని భారత బౌలర్లు ఉపయోగించలేకపోతున్నారు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.