బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా నయా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి అదృష్టం వరించింది. ఔటైనప్పటికీ ఈ తెలుగు కుర్రాడు నాటౌట్‌గా మిగిలాడు. అలా అని అది నోబాల్ కాదు. ఆసీస్ ప్లేయర్లు ఔట్ అంటూ అపీల్ కూడా చేశారు. అయితే అదృష్టంతో అవకాశాన్ని దక్కించుకున్న నితీశ్ బౌండరీలతో హోరెత్తిస్తున్నాడు.
అసలేం జరిగిందంటే..37వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ లెగ్ సైడ్ దిశగా వేసిన అయిదో బంతిని నితీశ్ రెడ్డి షాట్‌కు యత్నించాడు. కానీ అది సరిగ్గా కనెక్ట్ కాలేదు. బంతిని వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ఎలాంటి పొరపాటు లేకుండా అందుకున్నాడు. అయితే నితీశ్ గ్లవ్స్‌కు తగులుతూ ఆ బంతి వెళ్లిందనే గట్టి నమ్మకంతో స్టార్క్ అపీల్ చేశాడు. సహచరులు కూడా ఎంతో ఉత్సాహంతో ఔట్ అంటూ అంపైర్‌ను అడిగారు.

కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రివ్యూకి వెళ్లాలని ఆస్ట్రేలియా భావించింది. అయితే మరో ఒక్క రివ్యూ మాత్రమే మిగిలి ఉండడంతో కంగారూలు కంగారుపడ్డారు. సమీక్షకు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ కాలయాపన చేశారు. మొత్తంగా రివ్యూని కోరలేదు. అయితే రిప్లేలో నితీశ్ గ్లవ్స్‌కు తాకుతూ బంతి వెళ్లిందని తేలింది. దీనిని చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.
కాగా, నితీశ్ రెడ్డి ఆటను వ్యాఖ్యాతలు సునీల్ గవాస్కర్, హర్షా భోగ్లే కొనియాడుతున్నారు. మంచి ఫుట్‌వర్క్‌తో దీటుగా ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటున్నాడని గవాస్కర్ పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి నితీశ్ అని కామెంటరీలో హర్షా భోగ్లే పరిచయం చేస్తూ.. ఈ యువ ఆల్‌రౌండర్ ఆటను పొగిడాడు. అయితే నితీశ్ ఔట్ నుంచి తప్పించుకోవడంతో హర్షా భోగ్లే ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌తో నితీశ్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 46 ఓవర్లకు 124/7 స్కోరు చేసింది. నితీశ్ రెడ్డి (27)తో పాటు మరో డెబ్యూ ప్లేయర్ నితీశ్ రాణా క్రీజులో ఉన్నాడు.