టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. సూపర్-8లో విజయాలతో హోరెత్తించి దర్జాగా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సెయింట్ లూసియా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు బ్యాటింగ్ హిట్‌మ్యాన్ చేశాడు.
ఆది నుంచే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 41 బంతుల్లో 92 పరుగులు చేసి తృటిలో శతకాన్ని కోల్పోయాడు. ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో హోరెత్తించాడు. అయితే మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్ బాది ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతిని లాఫ్టెడ్ చేస్తూ డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా హిట్‌మ్యాన్ సిక్సర్ బాదాడు.

రెండో బంతిని స్టార్క్ ఔట్ సైడ్‌గా వేసిన రోహిత్ వదల్లేదు. దాన్ని వెంటాడి మరో సిక్సర్ బాదాడు. అదే జోరులో తర్వాత బౌండరీ సాధించాడు. నాలుగో బంతిని హిట్‌మ్యాన్ 96 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. అయిదో బంతికి పరుగులేమి చేయని రోహిత్ ఆఖరి బంతిని కూడా స్టాండ్స్‌కు తరలించాడు. స్టార్క్ వేసిన ఫుల్‌టాస్‌ను థర్డ్ మ్యాన్ దిశగా సిక్సర్ బాదాడు. రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (31; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తాచాటడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 205 పరుగులు చేసింది.
శివమ్ దూబె (28; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), హార్దిక్ పాండ్య (27 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులు చేశారు. మిచెల్ స్టార్క్ (2/45), స్టొయినిస్ (2/56) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (76; 43 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మిచెల్ మార్ష్ (37; 28 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. అర్షదీప్ (3/37), కుల్‌దీప్ (2/24) వికెట్లతో సత్తాచాటారు.