అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి సిరీస్‌లో 1-1తో నిలిచింది. 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదన పూర్తిచేసింది. నాథన్ మెక్‌స్వీనీ(10 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా(9 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
అంతకుముందు 128/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 36.5 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. నితీశ్ కుమార్ రెడ్డి(42; 47 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్(5/57) అయిదు వికెట్లు, స్కాట్ బొలాండ్(3/51) మూడు, మిచెల్ స్టార్క్(2/60) రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులు చేయగా, ఆసీస్ 337 పరుగులు సాధించింది.

కాగా, మ్యాచ్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. విజయానికి మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ అద్భుత ప్రదర్శన కారణమని అన్నాడు. దశాబ్దం పాటు జట్టు విజయాల్లో స్టార్క్‌ది ప్రధాన పాత్ర అని కమిన్స్ తెలిపాడు. స్టార్క్ అద్భుతమైన ఆటగాడు అని, ఆస్ట్రేలియా జట్టులో అతను ఉండటం తమ అదృష్టమని కొనియాడాడు. ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడుతూ... హొమ్ గ్రౌండ్ అడిలైడ్‌లో హెడ్ ఆడటానికి ఎంతో ఇష్టపడతాడని కమిన్స్ పేర్కొన్నాడు. మ్యాచ్‌ను భారత్ చేతుల్లో నుంచి హెడ్ లాగేశాడని అన్నాడు.
హెడ్ బ్యాటింగ్‌కు వెళ్లిన సందర్భం ఏదైనా ఉండవచ్చని, కానీ అతను మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడని కమిన్స్ తెలిపాడు. భారీ ఆధిక్యం సంపాదించడంతో విజయం సాధించడం సులువైందని కమిన్స్ తెలిపాడు. ఫ్లడ్ లైట్ల కింద ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం దక్కడం కూడా కలిసొచ్చిందని అన్నాడు. హేజిల్‌వుడ్ స్థానంలో వచ్చిన బొలాండ్ చక్కని ప్రదర్శన చేశాడన్నాడు. వచ్చే వారంలో హేజిల్‌వుడ్ తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయన్నాడు. గాయం కారణంగా జోస్ హేజిల్‌వుడ్ రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.

ఇక తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీయడం సంతోషంగా ఉందని తెలిపాడు. పెర్త్ టెస్టులో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయినందుకు దిగులు చెందానని, కానీ అడిలైడ్ టెస్టులో ప్రదర్శన సంతృప్తి ఇచ్చిందని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా, శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.