అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాస్ పరాజయాన్ని మరిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
534 పరుగుల కొండంత లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 58.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (89; 101 బంతుల్లో, 8 ఫోర్లు), మిచెల్ మార్ష్ (47; 67 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ కేరీ (36; 58 బంతుల్లో, 2 ఫోర్లు) పోరాడారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో విజృంభించారు. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా ఒక్క వికెట్ పడగొట్టారు.

అయితే ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఆల్‌రౌండ్ షో ప్రదర్శనతో దిగ్గజాల నుంచి ప్రదర్శన అందుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే కష్టాల్లో నిలిచిన జట్టును గొప్పగా ఆదుకుని భవిష్యత్ తారగా గుర్తింపు పొందాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగుల చేసిందంటే.. నితీశ్ రెడ్డి ప్రధాన కారణం. సహచరులు వెనుదిరుగుతున్నా 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. తన ఆరాధ్య క్రికెటర్‌తో కలిసి 54 బంతుల్లో అబేధ్యంగా 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతితోనూ చెలరేగాడు. ప్రమాదకరంగా మారుతున్న మిచెల్ మార్ష్‌ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. టెస్టు కెరీర్‌లో నితీశ్‌కు ఇదే తొలి వికెట్. ఈ క్రమంలో నితీశ్ రెడ్డిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. అరంగేట్రంలో అదరగొట్టాడని, తెలుగోడి సత్తాను ప్రపంచ వేదికపై చూపించాడని, మీసం తిప్పాడని నెటిజన్లు కొనియాడుతున్నారు.