సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్‌తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. అయితే తొలి టెస్టు భారత జట్టు కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరమవ్వడం, శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా అందుబాటులో ఉండకపోవడంతో టాప్ ఆర్డర్ బలహీనంగా మారింది.

అంతేగాక కేఎల్ రాహుల్ కూడా పూర్తి ఫిట్‌నెస్ లేకపోవడం, అభిమన్యు ఈశ్వరన్ ఫామ్‌లో లేకపోవడం భారత్ అభిమానులను కలవరపెడుతోంది. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం తుదిజట్టుపై ఎంతో స్పష్టత ఉన్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. రోహిత్ గైర్హాజరీతో జస్‌ప్రీత్ బుమ్రా జట్టును ఎంతో గొప్పగా నడిపిస్తాడని విశ్వాసంతో గంభీర్ ఉన్నాడని సమాచారం. అలాగే యువ పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డిని తుదిజట్టులోకి తీసుకురావాలని గంభీర్ పట్టుదలతో ఉన్నాడని తెలుస్తోంది.
ఐపీఎల్‌తో పాటు బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డి సత్తాచాటి అందరి దృష్టి ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బదులుగా భారత్-ఏ జట్టు తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు పంపారు. కానీ నితీశ్ ఆస్ట్రేలియా-ఏ జట్టుతో అంచనాలను అందుకోలేకపోయాడు. రెండు టెస్టుల్లో 71 పరుగులే చేశాడు. బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్‌తోనే మెరిశాడు.
కానీ మ్యాచ్ సిమ్యులేషన్‌లో నితీశ్ సత్తాచాటాడు. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్‌ను బంతితో ఇబ్బంది పెట్టాడు. ఈ నేపథ్యంలో భారత్-ఏ తరఫున ప్రదర్శనతో సంబంధం లేకుండా నితీశ్‌ను తొలి టెస్టు తుదిజట్టులో ఆడించాలని గంభీర్ నిర్ణయించున్నాడని సమాచారం. నితీశ్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).