అడిలైడ్ డే/నైట్ టెస్టులో వాగ్వాదానికి దిగిన ట్రావిస్ హెడ్ - మహ్మద్ సిరాజ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. రెండో ఇన్నింగ్స్‌లో హెడ్‌ను సిరాజ్ ఔట్ చేసిన అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. స్టన్నింగ్ డెలివరీతో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో గొడవ మొదలైంది. బ్యాటుతో సమాధానం చెప్పలేకపోయిన హెడ్ అనంతరం మాటలతో బదులిచ్చాడు. మరోవైపు హైదరాబాదీ పేసర్ తగ్గేదేలా అంటూ ఇక వెళ్లిపో.. అంటూ సింబాలిక్‌గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.
దీని గురించి ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్‌లతో పాటు ఇరు జట్లు కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ కూడా స్పందించారు. గొడవ గురించి వైస్ కెప్టెన్ అయిన హెడ్ చూసుకుంటాడని, అతను పెద్దోడే అని కమిన్స్ పేర్కొనగా, దూకుడుగా ఉండటంలో తప్పు లేదని, సిరాజ్‌కు మద్దతుగా నేను ఉంటానని రోహిత్ శర్మ చెప్పాడు. మరోవైపు హెడ్.. తాను బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకున్నానని, కానీ సిరాజ్ మాత్రం అపార్థం చేసుకున్నాడని అన్నాడు.

ట్రావిస్ హెడ్ అబద్దాలు చెప్పాడని, టీవీలో రిప్లే చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని సిరాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అయితే మొత్తంగా మ్యాచ్ ముగిసిన అనంతరం హెడ్-సిరాజ్ కలుసుకున్నారు. ఆ సంఘటనను అక్కడితో వదిలేసి ముందుకు వెళ్దామని నిశ్చయించుకున్నారు. అయితే గొడవపై ఐసీసీ సీరియస్ ఉంది. హెడ్-సిరాజ్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని తెలిసింది. ఆటగాళ్లపై నిషేధం విధించకుండా జరిమానా తో మందలించాలని భావిస్తోంది. కాగా, డీమెరిట్ పాయింట్ విధించకుండా జరిమానాతో ఐసీసీ సరిపెట్టడం ఇరు జట్లకు మంచిది.
కాగా, అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.