ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అదరగొట్టాడు. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇంత అద్భుతమైన బౌలర్ అయినా కూడా షమీకి టీమిండియా ప్రధాన జట్టులో చోటు దక్కడం లేదు. కేవలం ఇద్దరు ప్రధాన పేసర్లతో బరిలో దిగుతున్న భారత జట్టు సిరాజ్, బుమ్రా వైపే మొగ్గు చూపుతోంది.
అయితే దీని వల్ల తానేం బాధ పడటం లేదని, జట్టు లక్ష్యాల గురించే ముందుగా ఆలోచిస్తానని చెప్పాడు. ఇలా జట్టు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లే సమయంలో తను కాకపోతే మరొకరిని పక్కన పెట్టక తప్పదని వివరించాడీ వెటరన్ పేసర్. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో కూడా షమీకి ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం రాలేదు. సిరాజ్, బుమ్రానే ఎక్కువ మ్యాచులు ఆడారు.

కేవలం బంగ్లాదేశ్, నేపాల్‌తో మ్యాచుల్లో మాత్రమే షమీకి ఆడే అవకాశం దక్కింది. కీలకమైన ఫైనల్ మ్యాచులో కూడా షమీని జట్టులోకి తీసుకోలేదు. ఆస్ట్రేలియాతో సిరీసులో సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చిన టీం మేనేజ్‌మెంట్.. షమీని జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచులో తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన షమీ ఐదు వికెట్లు తీసుకొని చెలరేగాడు. ఇది అతని కెరీర్ బెస్ట్ ప్రదర్శన కూడా కావడం గమనార్హం.
అంతేకాదు 2007లో జహీర్ ఖాన్ తర్వాత స్వదేశంలో వన్డేలో ఐదు వికెట్లు తీసుకున్న పేసర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. ఇంత మంచి బౌలర్ అయ్యుండీ టీంలో రెగ్యులర్ మెంబర్ కాకపోవడంపై ఎలా ఫీల్ అవుతున్నారని అడగ్గా.. దీనిలో చికాకు పడే విషయం ఏదీ లేదని షమీ అన్నాడు. ఈ ఆటలో ఇలా జరగడం సహజమే అని లైట్ తీసుకున్నాడు. జట్టు అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యమన్నాడు.
'ఈ ఆటలో ఇదంతా ఒక పార్శిల్. మనం ఎప్పుడూ తుది జట్టులో, టీం కాబినేషన్స్‌లో ఉంటామని గ్యారంటీ ఉండదు. మనం రెగ్యులర్‌గా ఆడేటప్పుడు ఎవరో ఒకరు పక్కన కూర్చోక తప్పదు కదా. దీని గురించి ఫ్ట్రస్ట్రేట్ అవడం దండగ. తుది జట్టులో మనకు చోటు దక్కితే సంతోషమే. అదే సమయంలో బెంచ్‌పై ఉన్నప్పుడు ఆ నిర్ణయాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం' అని షమీ వివరించాడు.