అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాస్ పరాజయాన్ని మరిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
534 పరుగుల కొండంత లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 58.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (89; 101 బంతుల్లో, 8 ఫోర్లు), మిచెల్ మార్ష్ (47; 67 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ కేరీ (36; 58 బంతుల్లో, 2 ఫోర్లు) పోరాటంతో ఆసీస్ కాస్త గౌరవంగా ఓడింది. లేదంటే రికార్డు ఓటమి చవిచూసేది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో విజృంభించారు. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా ఒక్క వికెట్ పడగొట్టారు.

యశస్వీ జైస్వాల్ (161; 297 బంతుల్లో, 15 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (100 నాటౌట్; 143 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 487/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150, ఆసీస్ 104 పరుగులకే పరిమితమైంది. కాగా, విజయానంతరం టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను 2018లో ఆడిన పెర్త్ పిచ్‌తో పోలిస్తే ఈ సారి పెర్త్ వికెట్‌లో ఘాటు తగ్గిందని అన్నాడు.
''సిరీస్‌ను చక్కగా ఆరంభించడం సంతోషంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఒత్తిడికి గురైన తర్వాత గొప్పగా పుంజుకున్న తీరు పట్ల గర్వపడుతున్నాను. 2018లో పెర్త్‌లో ఆడినప్పుడు వికెట్ తొలుత సాఫ్ట్‌గా ఉంది. ఆ తర్వాత వేగంగా-వేగంగా మారిపోయింది. ఆ అనుభవంతో పోలిస్తే ఈ వికెట్ కాస్త ఘాటు తగ్గింది. ప్రక్రియ, సామర్థ్యంపైనే నేను నమ్ముతాను. అనుభవం ఎంతో ముఖ్యం. అదే ఆటలో భిన్నంగా చేయడానికి సాయపడుతుంది''
''ఇక జైస్వాల్ టెస్టు కెరీర్‌ను గొప్పగా ఆరంభించాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నా. అతను బంతిని వదిలేయడం, సందర్భాన్ని బట్టి ఎటాకింగ్ గేమ్ ఆడటం బాగుంది. విరాట్ కోహ్లి గురించి మాట్లాడాలంటే.. అతను ఫామ్ కోల్పోయాడనేది ఉండదు. సవాలైన వికెట్లపై ఓ బ్యాటర్ ఫామ్‌ను అంచనా వేయలేం. అతను నెట్స్‌లో మంచి లయతో ఉన్నాడు'' అని బుమ్రా పేర్కొన్నాడు.