బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. బుమ్రా ధాటికి ఆసీస్ బ్యాటర్లు వణికిపోతున్నారు. శనివారం ఆటలో బుమ్రా తన తొలి బంతికే అలెక్స్ కేరీ (21; 31 బంతుల్లో, 3 ఫోర్లు)ని పెవిలియన్‌కు చేర్చాడు. బుమ్రా వేసిన బంతిని ఎదుర్కోలేక కేరీ వికెట్ కీపర్ పంత్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అయితే అలెక్స్ కేరీ వికెట్‌తో బుమ్రా ఖాతాలో అయిదు వికెట్లు చేరాయి. ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సేనా) దేశాలపై అత్యధిక సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా కపిల్ దేవ్ సరసన జస్‌ప్రీత్ బుమ్రా నిలిచాడు. సేనా దేశాలపై కపిల్, బుమ్రా ఏకంగా ఏడు సార్లు అయిదు వికెట్లు సాధించారు. ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది బుమ్రానే.

బుమ్రా 51 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, కపిల్ దేవ్ 62 ఇన్నింగ్స్‌ల్లో ఏడు సార్లు అయిదు వికెట్లు పడగొట్టాడు. నాటింగ్‌హమ్, కేప్‌టౌన్ వేదికల్లో రెండు సార్లు, జొహెన్నెస్‌బర్గ్, మెల్‌బోర్న్, పెర్త్‌లో ఒకసారి బుమ్రా అయిదు వికెట్లు ఘనత సాధించాడు. టెస్టు కెరీర్‌లో బుమ్రా ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్ అయిదు వికెట్లు 11వ సారి పడగొట్టాడు. దక్షిణాఫ్రికాలో మూడు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్‌లో రెండు సార్లు ఈ ఘనత సాధించాడు.
కాగా, 67/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా పోరాడుతోంది. 50 ఓవర్లకు 102/9 స్కోరు చేసింది. ప్రధాన బ్యాటర్లు విఫలమైనా మిచెల్ స్టార్క్ (26 బ్యాటింగ్), హేజిల్‌వుడ్ (6 బ్యాటింగ్) గొప్పగా పోరాడుతున్నారు. ఆఖరి వికెట్‌కు అభేధ్యంగా 23 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం. స్టార్క్-హేజిల్‌వుడ్ కలిసి 100 బంతులకు పైగా ఎదుర్కొన్నారు.