అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాస్ పరాజయాన్ని మరిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
534 పరుగుల కొండంత లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 58.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (89; 101 బంతుల్లో, 8 ఫోర్లు), మిచెల్ మార్ష్ (47; 67 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ కేరీ (36; 58 బంతుల్లో, 2 ఫోర్లు) పోరాడారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో విజృంభించారు. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా ఒక్క వికెట్ పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 487/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150, ఆసీస్ 104 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో అయిదు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో సత్తాచాటిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అయితే రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టును గొప్పగా విజయపథంలో నడిపించిన బుమ్రా సారథిగా అరుదైన ఘనతలు సాధించాడు.
పెర్త్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన రెండో ఏషియన్ కెప్టెన్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ ఘనతను అనిల్ కుంబ్లే (2008) సాధించాడు. ఇక టెస్టుల్లో భారత కెప్టెన్లు బౌలింగ్‌లో సాధించిన అత్యుత్తమ గణాంకాల జాబితాలో బుమ్రా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్ (10/35) వర్సెస్ వెస్టిండీస్-1983; బిషన్ సింగ్ (10/194) వర్సెస్ ఆస్ట్రేలియా-1977; బిషన్ సింగ్ (9/70) వర్సెస్ న్యూజిలాండ్- 1976; జస్‌ప్రీత్ బుమ్రా (8/72) వర్సెస్ ఆస్ట్రేలియా- 2024; కపిల్ దేవ్ (8/109) వర్సెస్ ఆస్ట్రేలియా-1985.