అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. 2024లో టెస్టుల్లో 50 వికెట్ల మార్క్‌ను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఉస్మాన్ ఖవాజా (13; 35 బంతుల్లో, 2 ఫోర్లు)ను ఔట్ చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనతలు సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో 50+ టెస్టు వికెట్లు సాధించిన మూడో భారత ఫాస్ట్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ ఘనత కపిల్ దేవ్, జహీర్ ఖాన్ మాత్రమే అందుకున్నారు.
ఓ క్యాలెండ్ ఇయర్‌లో కపిల్ దేవ్ రెండు సార్లు 50+ టెస్టు వికెట్లు సాధించాడు. 1979లో 74 వికెట్లు, 1983లో 75 వికెట్లు పడగొట్టాడు. 2002లో జహీర్ ఖాన్ 51 వికెట్లు తీశాడు. కాగా, 31 ఏళ్ల బుమ్రా ఈ ఏడాది ఆడిన 11వ టెస్టులో 50 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఏడో భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఓ ఏడాది టెస్టుల్లో కపిల్ దేవ్, జహీర్, బుమ్రాతో పాటు స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా 50+ వికెట్లు సాధించాడు.

రవిచంద్రన్ అశ్విన్ నాలుగు సార్లు 50+ టెస్టు వికెట్లు సాధించగా, అనిల్ కుంబ్లే మూడు సార్లు, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్ రెండు సార్లు ఈ ఘనత అందుకున్నారు. కాగా, బుమ్రా తన పుట్టినరోజున ఈ అరుదైన జాబితాలో చోటు సంపాదించడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో మూడో సెషన్‌లో డ్రింక్స్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 17 ఓవర్లకు 38/1 స్కోరు చేసింది. టీమిండియా కంటే 142 పరుగుల వెనుకంజలో ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (42; 54 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (37; 64 బంతుల్లో, 6 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (31; 51 బంతుల్లో, 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (22; 22 బంతుల్లో, 3 ఫోర్లు), రిషభ్ పంత్ (21; 35 బంతుల్లో, 2 ఫోర్లు) రాణించారు. మిగిలిన బ్యాటర్లూ ఎవరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (6/48) ఆరు వికెట్లతో విజృంభించాడు. ప్యాట్ కమిన్స్ (2/41), స్కాట్ బొలాండ్ (2/54) చెరో రెండు వికెట్లు తీశారు.