పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. మూడో రోజు ఆటలోనూ టీమిండియానే పైచేయి సాధించింది. యశస్వీ జైస్వాల్ (161; 297 బంతుల్లో, 15 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (100 నాటౌట్; 143 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 487/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 534 పరుగుల కొండంత లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. ఆదివారం ఆట ముగిసేసరికి 12 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
172/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ ఆట ఆరంభించిన యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ (77; 176 బంతుల్లో, 5 ఫోర్లు) సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. అయితే స్కోరుబోర్డు 200 దాటిన తర్వాత రాహుల్ వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్ (25; 71 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. రిషభ్ పంత్ (1), ధ్రువ్ జురెల్ (1) నిరాశపరిచారు.

కానీ వాషింగ్టన్ సుందర్ (29; 94 బంతుల్లో, 1 సిక్సర్)తో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుందర్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (38 నాటౌట్; 27 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి కోహ్లి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 500 రోజుల అనంతరం టెస్టుల్లో సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో లైయన్ రెండు వికెట్లు, మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్, హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనిని బుమ్రా డకౌట్ చేశాడు.నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన కమిన్స్ (2)ను సిరాజ్ ఔట్ చేశాడు. కాసేపటికే మార్నస్ లబుషేన్ (3)ను బుమ్రా ఔట్ చేసి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.