IND vs AUS: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ పేర్లు కేవలం ఆటగాళ్లవి కాదు.. భారత క్రికెట్‌కు గర్వకారణం. వీరిద్దరివి రెండు పేర్లైనా వారి ఆటతీరు ఒకటే.. వారి పోరాటం ఒకే కథలా సాగుతుంది. రో-కో అని అంటేనే అభిమానుల్లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వారు జట్టులో ఉంటే అంత ధైర్యం. టీమిండియా చీకటి నుంచి విజయకాంతుల్లోకి రావడానికి కారణమైన ఆ జోడీ.. ఓటమిలో కూడా ఆశను నింపింది. కానీ ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగబోయే మూడో మూన్డే(అక్టోబర్ 25, శనివారం) వీరిద్దరికీ ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తరఫున ఆడే చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా గడ్డపై చివరిపోరా?
రోహిత్ శర్మ మొదటిసారి 2007-08లో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా వచ్చాడు. విరాట్ కోహ్లీ సీనియర్ జట్టుతో 2011-12 సీజన్‌లో పర్యటించాడు. అడిలైడ్‌లో టెస్ట్ సెంచరీ చేసి తన ముద్ర వేశాడు. వచ్చే రెండేళ్లలో ఆస్ట్రేలియాలో ఎలాంటి వన్డే సిరీస్‌లు లేకపోవడం వల్ల ఈ జోడీ మళ్లీ భారత్ తరఫున ఆస్ట్రేలియాలో ఆడుతుందా అని ఊహించడం కష్టంగా మారింది. వయస్సు పెరగడం, కొత్త ఆటగాళ్ల రాక నేపథ్యంలో సిడ్నీలో జరిగే ఈ మ్యాచ్ వీరిద్దరికీ ఆస్ట్రేలియాలో చివరి వన్డే కావచ్చు.

విరాట్ విఫలం.. రోహిత్ కు తాత్కాలిక ఊరట
రోహిత్ శర్మ అక్టోబర్ 23న జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో వన్డేలో 97 బంతుల్లో 73 పరుగులు చేసి కొంత ఊరట పొందాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఈ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు. వన్డే క్రికెట్ చరిత్రలో కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి. కోహ్లీ వరుస వైఫల్యం, రోహిత్-కోహ్లీల వయస్సుపై వస్తున్న కామెంట్లు.. ఇది వారి అంతానికి ప్రారంభమా అని అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి.
క్లీన్ స్వీప్‌ను అడ్డుకునేనా?
ఆస్ట్రేలియా ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీల ఉనికి కారణంగా మూడో వన్డే క్రికెట్ అభిమానులకు అత్యంత కీలకంగా మారింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రేక్షకులు ఈ ఇద్దరి నుంచి భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లోని భారత జట్టు 0-3తో క్లీన్ స్వీప్ అవ్వకుండా తప్పించుకోవాలని చూస్తోంది. అయితే భారత్ తరఫున గణాంకాలు అనుకూలంగా లేవు. సిడ్నీలో భారత్ గత ఐదు వన్డే మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఈ కీలకమైన మ్యాచ్‌లో రోహిత్-కోహ్లీ జోడీ తమ ముద్ర వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.