అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన విషయం తెలిసిందే. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ తప్పనిసరిగా గెలవాలి. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌తో లేడని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డామియన్ ఫ్లెమింగ్ అన్నాడు.

బుమ్రా గాయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ దాచిపెడుతుందని ఫ్లెమింగ్ ఆరోపించాడు. అడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బుమ్రా మైదానంలో ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఫిజియో అతనికి చికిత్స చేశాడు. అయితే అది తిమ్మిరి మాత్రమే అని, సమస్య ఏమీ లేదని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ వివరించాడు. కానీ డామియన్ ఫ్లెమింగ్ మోర్కెల్ వివరణతో ఏకీభవించలేదు. బుమ్రా పరిస్థితిపై తీవ్రమైన అనుమానాలు ఉన్నాయన్నాడు.
''అది తిమ్మిరి కాదు. తొలి ఇన్నింగ్స్ విరామం అనంతరం బుమ్రా చాలా అల్లాడిపోయాడు. తర్వాత బౌలింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదిగానేమి బౌలింగ్ చేయలేదు. కానీ అతను రెండో ఇన్నింగ్స్‌లో ఆ ఓవర్ ఎందుకు బౌలింగ్ చేశాడనేది తెలియట్లేదు. అది అనుమానాలకు దారి తీస్తోంది'' అని డామిన్ ఫ్లెమింగ్ అన్నాడు. రెండో టెస్టులో 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదన పూర్తిచేసింది. అయితే బుమ్రా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. మిగిలిన ఓవర్లను సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి వేశారు.
కాగా, మంగళవారం బుమ్రా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు. ఈ క్రమంలో బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నెట్టింట్లో వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సిరీస్‌లోని అయిదు టెస్టుల ఆడటం కోసం బుమ్రాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని రోహిత్ ఓటమి అనంతరం చెప్పాడు. స్పెల్ ముగిసిన అనంతరం ప్రతిసారి బుమ్రా వద్దకు వెళ్లి, పనిభారం గురించి తెలుసుకుంటున్నామని వెల్లడించాడు.