Virat Kohli: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్‌ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా (Ind vs Aus final). మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్‌కు అభిమానులు పోటెత్తారు. వేర్వేరు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు- వ్యక్తిగత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటోన్నారు.
కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అమీతుమీ తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోన్నాయి.

ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సన్నద్ధమౌతోంది. ఉంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్‌లో మట్టికరిపించిన దూకుడు మీద కనిపిస్తోందా జట్టు. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్‌ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎలా రాణిస్తాడనేది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే- అతనికి దూకుడుకు బ్రేకులు వేసే ఏకైక బౌలర్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు కాబట్టి. అతని బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో ఇబ్బందులు పడుతున్నాడు కోహ్లీ. చాలా బ్యాడ్ రికార్డ్స్ ఉన్నాయి.

ఆ బౌలర్- జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood). వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌లల్లో అయిదు సార్లు తన వికెట్‌ను హేజిల్‌వుడ్‌కు సమర్పించుకున్నాడీ ఇండియా బ్యాటింగ్ రన్ మెషీన్. భారీగా పరుగులను రాబ్టటుకోలేక సతమతమౌతున్నాడు.
ఈ ఎనిమిది ఇన్నింగ్స్‌లల్లో 88 బంతులను ఎదుర్కొని, 51 పరుగులు చేశాడు కోహ్లీ. స్ట్రైక్ రేట్ 57.95. బ్యాటింగ్ యావరేజ్ 10.20. మూడు బౌండరీలు మాత్రమే కొట్టగలిగాడంటే కోహ్లీని హేజిల్‌వుడ్ ఏ స్థాయిలో కట్టడి చేయగలిగాడో అర్థం చేసుకోవచ్చు. హేజిల్‌వుడ్ సంధించిన ఏ ఒక్క డెలివరీని కూడా సిక్సర్‌గా మలచలేకపోయాడు. ఈ ఫైనల్స్‌లో ఆ కొరత తీరుతుందేమో చూడాలి.