IND vs AUS final: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్‌ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా (Ind vs Aus final). మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. తాడో పేడో తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి.
కేప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస అయ్యర్, రవీంద్ర జడేజాతో కూడిన భారత జట్టు దూకుడును ఆస్ట్రేలియా ఎలా అడ్డుకుంటుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ మందకొడిగా ఉంటుందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో బౌలర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్ కోసం అటు ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సన్నద్ధమౌతోంది. ఉంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్‌లో మట్టికరిపించిందా కంగారూల టీమ్. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్‌ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది.
అటు ఫైనల్ మ్యాచ్.. ఇటు ఆదివారం సెలవు రోజు కావడంతో అహ్మదాబాద్‌కు అభిమానులు పోటెత్తారు. వేర్వేరు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు- వ్యక్తిగత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటోన్నారు. వందే భారత్ సహా పశ్చిమ రైల్వే 11 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, ముంబైల నుంచి ఆయా రైళ్లన్నీ అహ్మదాబాద్ వైపు పరుగులు తీస్తోన్నాయి.
ఈ మ్యాచ్‌పై క్రికెట్ పండితుల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లెజెండరీ ప్లేయర్లు, మాజీలందరి ఓటూ భారత్‌కే పడుతోంది. దీనికి గల కారణాలను సైతం సాంకేతికపరంగా విశ్లేషిస్తోన్నారు. ఆస్ట్రేలియా కంటే భారత్.. బలంగా ఉందని, ఇదివరకు ఎప్పుడూ లేనంత శతృదుర్భేధ్యంగా టీమిండియా తయారైందని చెబుతున్నారు.

భారత్ మాజీ ప్లేయర్లు గౌతమ్ గంభీర్, ఇర్ఫాన పఠాన్, సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్, ఆ దేశానికే చెందిన మాజీ కేప్టెన్ ఆరోన్ ఫించ్, దక్షిణాఫ్రికా మాజీ స్పిన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్, వెస్టిండీస్ లెజెండ్ ఇయాన్ బిషప్.. తాజాగా తమ ఫేవరెట్ టీమ్‌ను ఎంచుకున్నారు. వారందరూ మూకుమ్మడిగా భారత్ వైపే మొగ్గు చూపారు.
ఈ వరల్డ్ కప్ 2023లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం- జట్టు కూర్పేనని, ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని షేన్ వాట్సన్ చెప్పాడు. ఈ ఫైనల్స్‌లో ఎవరు గెలుస్తారంటే తాను భారత్ పేరే చెబుతానని దక్షిణాఫ్రికా వెటరన్ ఇమ్రాన్ తాహిర్ స్పష్టం చేశాడు.