ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా (Ind vs Aus final). ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.
తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. 43 ఓవర్లల్లో 241 పరుగులతో విజయదుందుభి మోగించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్‌లో ఒక్కసారి కూడా భారత్ ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి మ్యాచ్‌లోనూ పోటీ పడి వికెట్లు నేల కూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్‌లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. జస్‌ప్రీత్ బుమ్రా-2, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఈ వరల్డ్ కప్‌తో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) రెండు సంవత్సరాల కాల పరిమితి కూడా ముగిసింది. వరల్డ్ కప్ వరకు అంటే ఈ నెలాఖరు వరకు ఆయనను హెడ్ కోచ్‌గా అపాయింట్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఆయన కాంట్రాక్ట్‌ను పొడిగించాలా? లేదా? అనేది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంది.
పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు రాహుల్ ద్రావిడ్. తన టెన్యుర్ పొడిగింపునకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్యానించాడు. దీని మీద తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేననీ తేల్చి చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా ఇదే చివరి ప్రెస్ కాన్ఫరెన్సా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడు.
కనీసం 30 నుంచి 40 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు ద్రావిడ్. తొలి 10 ఓవర్లల్లో 80 పరుగులు చేశామని, ప్రారంభంలో పిచ్ బ్యాటింగ్‌కు సహకరించినప్పటికీ ఆ తరువాత మందకొడిగా మారిందని చెప్పాడు. మ్యాచ్ నడుస్తున్న కొద్దీ బంతి బ్యాట్‌పైకి దూసుకుని రావడం కనిపించిందని, దాని నుంచి ఆస్ట్రేలియా లబ్ది పొందగలిగిందని అంచనా వేశాడు.