ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా (Ind vs Aus final). ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.
తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. 43 ఓవర్లల్లో 241 పరుగులతో విజయదుందుభి మోగించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్‌లో ఒక్కసారి కూడా భారత్ ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి మ్యాచ్‌లోనూ పోటీ పడి వికెట్లు నేల కూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్‌లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. జస్‌ప్రీత్ బుమ్రా-2, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఈ ఓటమి పట్ల దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. లీగ్స్, సెమీ ఫైనల్స్‌లో ఎదురులేని జట్టుగా నిలిచిన భారత్.. ఫైనల్స్‌లో చతికిల పడటం పట్ల తీవ్ర నిరాశకు గురైంది. అటు ప్లేయర్లు సైతం కన్నీరుమున్నీరు అయ్యారు. రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ కన్నీరు పెట్టుకోవడం కనిపించింది.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యార్, శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా.. ఇలా ప్లేయర్లందరూ బాధను దిగమింగుకున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఉబికి వస్తోన్న కన్నీటిని ఆపుకోవడానికి బలవంతంగా ప్రయత్నించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టేడియం మొత్తాన్ని విషాద ఛాయల్ ఆవరించాయి.

భారత్ పరిస్థితి ఇలా ఉంటే.. ఈ కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సీన్ మరో రకంగా ఉంది. రాత్రంతా తాగి తందానాలాడారు. షాంపెన్‌తో స్నానం చేశారు. వారు బస చేసిన హోటల్ గదుల్లో తెగ ఎంజాయ్ చేశారు. కేప్టెన్ పాట్ కమ్మిన్స్, మిఛెల్ మార్ష్, ఆడమ్ జంపా, మార్కస్ స్టొయినిస్, మార్నుస్ లాంబుషేన్, జోస్ ఇంగ్లిస్.. ఇలా ఆ జట్టు ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
ఆ సమయంలో ఓపెనర్ మిఛెల్ మార్ష్.. తన రెండు కాళ్లను ఎత్తి వరల్డ్ కప్ 2023 ట్రోఫీపై పెట్టాడు. అతని చేతిలో షాంపెన్ బాటిల్ కనిపించింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను పాట్ కమ్మిన్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో కాస్త వైరల్‌గా మారింది. మిఛెల్ మార్ష్ పైత్యంపై నెటిజన్లు భగ్గుమంటోన్నారు. అతన్ని ట్రోల్ చేస్తోన్నారు.