Mohammed Siraj: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరోసారి పతనం దిశగా సాగుతోంది. కీలకమైన ఏడో వికెట్‌ను కూడా కోల్పోయింది. ఇక ఆ జట్టు రెండో ఇన్నింగ్‌కు తెర పడటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
టీమిండియా పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ధాటికి వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. సామ్ కొన్‌స్టాస్- 8, ఉస్మాన్ ఖవాజా- 21, స్టీవెన్ స్మిత్- 13, ట్రావిస్ హెడ్- 1, మిఛెల్ మార్ష్- 0, వికెట్ కీపర్ బ్యాటర్- అలెక్స్ క్యారీ- 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొత్తంగా 91 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా.

డేంజరస్ మార్నుస్ లాబుషేన్ ఒంటరి పోరాటం సాగించడం భారత జట్టును కలవరపాటుకు గురిచేసింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొని క్రీజ్‌లో నిలిచాడు. అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. కుదురుగా ఆడటం, ఊరించే బంతులను కూడా వదిలేయడాన్ని బట్టి చూస్తే అతనెంత జాగ్రత్తగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
టీ విరామం తరువాత లాబుషెన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. 70 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అతని వికెట్ మహ్మద్ సిరాజ్ ఖాతాలో పడింది. వికెట్ల కార్నర్‌లో బంతులను సంధించాలంటూ విరాట్ కోహ్లీ చేసిన సూచనలను అతను తూచ తప్పకుండా పాటించాడు. లాబుషెన్‌ను అవుట్ చేయగలిగాడు.
వరుసబెట్టి సిరాజ్.. వికెట్ల కార్నర్‌లో వేసిన బంతులను అడ్డుకునే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు లాబుషెన్. రివ్యూకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. అతను వెేసిన లెంగ్తీ డెలివరీని ఆడటంలో విఫలం అయ్యాడు లాబుషేన్. నేరుగా ఆ బంతి ప్యాడ్లను తాకింది. వికెట్ల కంటే ఎక్కువ ఎత్తులో వెళ్తోందని భావించిన లాబుషేన్ అప్పీల్‌కు వెళ్లాడు గానీ ఉపయోగం లేకుండా పోయింది. దీనితో 148 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఆసీస్.