హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య హైదరాబాద్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సిద్ధమైంది.
ఇందులో భాగంగా సోమవారం జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో హెచ్‌సీఏ ఈ మేరకు నిర్ణయించింది. దీనికి సంబంధించిన తేదీలను కూడా సోమవారం ప్రకటించింది. ఆయా తేదీల్లో ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియానికి తమ టికెట్‌ను తీసుకురావడంతో పాటు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అందజేయాలని సూచించింది.

తద్వారా టికెట్ డబ్బులను నేరుగా ప్రేక్షకుడి అకౌంట్‌లోకి బదిలీ చేస్తామని హెచ్‌సీఏ వెల్లడించింది. ఇందుకు గాను ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 23, 24 తేదీల్లో రూ.800.. 25, 26 తేదీల్లో రూ.1000.. 27, 28 తేదీల్లో రూ.1500.. 30, 31 తేదీల్లో రూ.5000 ధర కలిగిన టిక్కెట్ల వివరాలను ప్రేక్షకులు అందజేయాలని హెచ్‌సీఏ కోరింది.
అక్టోబర్ 23, 24: రూ. 800
అక్టోబర్ 25, 26: రూ. 1,000
అక్టోబర్ 27, 28: రూ. 1,500
అక్టోబర్ 30, 31: రూ. 5,000
కార్పొరేట్, హాస్పిటాలిటీ బాక్స్‌లకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అక్టోబర్ 13న జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు అంఫైర్లు ప్రకటించారు.