హైదరాబాద్: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆటగాడు మనీష్ పాండే అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 47 ఓవర్ ఐదో బంతిని ఆసీస్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్ స్కోంబ్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే అమాంతం గాల్లోకి ఎగిరి అందుకుని సమన్వయం కోల్పోతూ గాల్లోకి బంతిని విసిరేసి బౌండరీ లైన్ దాటాడు.
అనంతరం మళ్లీ తిరిగొచ్చి బంతిని అందుకున్నాడు. దీంతో హ్యాండ్స్ స్కోంబ్ 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌తో మైదానంలో భారత అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది.
దీంతో కోహ్లీసేనకు 294 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 220 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఆసీస్‌ను చివర్లో భారత బౌలర్లు కుప్పకూల్చారు.
224 పరుగుల దగ్గర ఫించ్ అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 243 పరుగుల దగ్గర స్మిత్, మ్యాక్స్‌వెల్ (5) అవుటయ్యారు. దీంతో ఆసీస్ భారీ స్కోరు చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.