IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం(అక్టోబర్ 19) పెర్త్‌లోని స్టేడియంలో జరగనుంది. అయితే మ్యాచ్‌కు సరిగ్గా ఒక రోజు ముందు వాతావరణ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సిరీస్‌తోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వస్తుండటంతో ఈ సిరీస్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే లేదా ఆలస్యమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
తొలి వన్డే రద్దవుతుందా?
పెర్త్‌లో ఆదివారం జరగబోయే తొలి వన్డే మ్యాచ్‌పై వాతావరణ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఆదివారం పెర్త్‌లో 63 శాతం వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మ్యాచ్ జరిగే సమయంలో 36 శాతం వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా మ్యాచ్‌లో పలుమార్లు అంతరాయాలు ఏర్పడవచ్చు. ఇది బ్యాటర్లకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.

టాస్‌దే కీలక పాత్ర
వర్షం కారణంగా టాస్ సమయంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భారత కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు టాస్ జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఈ సమయం మారవచ్చు. పెర్త్ పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు మంచి స్వింగ్, బౌన్స్‌ను అందిస్తుంది. ఇది బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపవచ్చు.
ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా అద్భుత రికార్డు
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. కంగారూ జట్టు ఈ మైదానంలో ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆస్ట్రేలియా ఇక్కడ ఆడిన మూడు వన్డే మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది.భారత జట్టు ఈ మైదానంలో ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్లు ఈ రికార్డును దృష్టిలో ఉంచుకుని, వర్షం ప్రభావం పడకముందే తమ ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదేమైనా, వర్షం కారణంగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఉత్సాహం తగ్గే అవకాశం ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.