టీమిండియా ఎంపికకు వేళాయే.. అతడిపై బారేడు కత్తి!
బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ రోజు గౌహతిలో సమావేశమై త్వరలో అఫ్ఘానిస్థాన్‌తో జరగబోయే సిరీస్ కోసం భారత జట్లను ప్రకటించనుంది. ఈ సిరీస్‌లో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో పాటు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. రాబోయే వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను దృష్టిలో ఉంచుకుని సీనియర్ల ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్‌పై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ పై సెలక్టర్లు ప్రధానంగా చర్చించనున్నారు.
వైస్ కెప్టెన్సీ నుంచి పంత్ ఔట్?
ఈ ఎంపికలో అత్యంత ఆసక్తికరమైన అంశం రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ. రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా రిషబ్ పంత్ కేవలం తన వికెట్ కీపింగ్, బ్యాటింగ్ పైనే పూర్తిగా దృష్టి సారించేలా చేయడమే జట్టు యాజమాన్యం ఉద్దేశంగా కనిపిస్తోంది. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని టెస్టుల్లో వ్యూహాత్మక మార్పులు చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

బుమ్రా, సిరాజ్ వర్క్‌లోడ్ మేనేజ్మెంట్.. హార్దిక్ పాండ్యాపై సస్పెన్స్!
రాబోయే భారీ అంతర్జాతీయ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్‌లో విశ్రాంతినిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మరో పేసర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి ఫామ్, అతనిపై ఉన్న బౌలింగ్ ఒత్తిడిని కూడా సెలక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వన్డే జట్టులోకి వస్తాడా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. గతేడాది మార్చి నుంచి హార్దిక్ భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడలేదు. వన్డేల్లో అతను నిలకడగా బౌలింగ్ చేయగలడా లేదా అనే శారీరక సామర్థ్యంపై కూడా సుదీర్ఘ చర్చ జరగనుంది.
కోహ్లీ స్థానం పదిలం.. జడేజా వర్సెస్ అక్షర్ పటేల్!
వన్డే క్రికెట్‌లో తన స్థానాన్ని నిరూపించుకోవాలనే ఒత్తిడి ఉందంటూ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ.. వన్డే జట్టులో అతని స్థానానికి ఎలాంటి డోకా లేదని స్పష్టమవుతోంది. కోహ్లీకి ఉన్న అపారమైన అనుభవం, ఫామ్ దృష్ట్యా బ్యాటింగ్ లైనప్‌కు ఆయనే ప్రధాన బలంగా నిలవనున్నాడు. అయితే స్పిన్ విభాగంలో సెలక్టర్లకు పెద్ద తలనొప్పి ఎదురుకానుంది. ఇద్దరు ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లలో ఎవరిని ఎంచుకోవాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. జడేజా అనుభవానికి ఓటేయాలా? లేక ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను కొనసాగించాలా? అనేది తేలాల్సి ఉంది.
రేసులో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి!
ఆఫ్-స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ పేరు పరిశీలనలో ఉండగా.. యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి పేరు కూడా సెలక్టర్ల టేబుల్‌పై ప్రముఖంగా వినిపిస్తోంది. సుందర్ టెక్నికల్ బ్యాటింగ్, స్పిన్‌తో జట్టుకు సమతుల్యతను ఇస్తుండగా.. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఉపయోగపడతాడని భావిస్తున్నారు. యువకులకు అవకాశాలు ఇస్తూనే, సీనియర్లను కాపాడుకునే వ్యూహంతో బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఈరోజు సాయంత్రం లోపు ఈ రెండు సిరీస్‌లకు సంబంధించిన అధికారిక జట్లను బీసీసీఐ ప్రకటించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications