1000వ టెస్టులో వెయ్యి పరుగులు: మరో ఘనతకు చేరువలో కోహ్లీ

హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టీమిండియా బుధవారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా తొలి టెస్టులో తలపడనుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుపై వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఆటగాడి రికార్డుని విరాట్ కోహ్లీ అందుకోనున్నాడు. ఈ ఘనతను అందుకోవడానికి కోహ్లీ 23 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టుపై 44.40 యావరేజితో 977 పరుగులు చేశాడు.

భారత్ తరుపున 12 మంది
కాగా, ఇప్పటివరకు భారత్ తరఫున ఈ ఘనతను 12 మంది ఆటగాళ్లు మాత్రమే అందుకున్నారు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 2,535 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇందులో ఏడు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టుపై సచిన్ యావరేజి 51.73గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో సునీల్ గావస్కర్(2,483), రాహుల్ ద్రవిడ్(1,950), గుండప్ప విశ్వనాథ్(1,880), దిలీప్ వెంగ్‌సర్కార్(1,589), అజహరుద్దీన్(1,278), విజయ్ మంజ్రేకర్ (1,181), మహేంద్ర సింగ్ ధోని(1,157), ఫరూక్ ఇంజినీర్(1,113), పుజారా(1,061), రవిశాస్త్రి(1,026)లు ఉన్నారు.

13వ ఆటగాడుగా కోహ్లీ అరుదైన ఘనత
భారత్-ఇంగ్లాండ్ మధ్య బుధవారం నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లిష్ జట్టుపై వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దీంతో భారత్ తరఫున ఆ ఘనత సాధించిన 13వ ఆటగాడుగా కోహ్లీ నిలుస్తాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌తో 14 మ్యాచ్‌లు ఆడాడు.

సొంతగడ్డపై ఆడిన 9 మ్యాచ్‌ల్లో కోహ్లీ 70.25 యావరేజి
ఇందులో 9 సొంతగడ్డపై కాగా 5 విదేశాల్లో ఆడాడు. సొంతగడ్డపై ఆడిన 9 మ్యాచ్‌ల్లో కోహ్లీ 70.25 యావరేజితో 843 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు, ఒక మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డులను సైతం గెలుచుకున్నాడు. అయితే, గత పర్యటనలో ఇంగ్లీషు గడ్డపై విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన చేశాడు. అయితే, ఈసారి సత్తా చాటాలని కోహ్లీ ఊవిళ్లూరుతున్నాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టులాడిన విరాట్ కోహ్లీ 13.40 యావరేజితో 134 పరుగులు మాత్రమే నమోదు చేశాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా పేలవ రికార్డు
ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ రెండుసార్లు డకౌటయ్యాడు. ఈ సిరిస్‌ను ఇంగ్లాండ్ 3-1తో కైవసం చేసుకుంది. తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక, తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో టీమిండియా పేలవ రికార్డుని కలిగి ఉంది. ఇప్పటివరకు ఇక్కడ ఆరు టెస్టు మ్యాచ్‌లాడిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి, ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 2005 నుంచి ఇక్కడ పది మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ ఒకే ఒక్కసారి ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications