IND-A vs PAK-A: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్ల మధ్య ఆరో మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టుకు జితేష్ శర్మ కెప్టెన్సీ వహించగా.. పాకిస్తాన్ జట్టుకు ఇర్ఫాన్ ఖాన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జాతీయ గీతం ఆలపించిన తర్వాత భారత-ఏ జట్టు కూడా 'నో షేక్‌హ్యాండ్' ధానాన్ని అనుసరించి పాకిస్తాన్-ఏ జట్టు ఆటగాళ్లతో చేతులు కలపలేదు. సీనియర్ జట్ల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఈ పద్ధతి ఈ టోర్నమెంట్‌లోనూ కొనసాగింది.
గత టోర్నమెంట్లలోనూ అదే పద్ధతి
గతంలో జరిగిన టీ20 ఆసియా కప్ 2025లో కూడా భారత సీనియర్ ఆటగాళ్లు ఏ పాకిస్తాన్ క్రికెట్‌తోనూ చేతులు కలపలేదు. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌తో సహా మొత్తం 3 మ్యాచ్‌లు ఆడగా.. ప్రతిసారీ పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. భారత్ ఆ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి టీ20 ఆసియా కప్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఇదే తరహాలో భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రీడాకారిణులతో చేతులు కలపలేదు, దీని గురించి కూడా అప్పట్లో విస్తృతంగా చర్చ జరిగింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తత
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు మరణించినప్పటి నుండి భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై చర్యలు చేపట్టింది. దీంతో భారత్‌లో పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలను బహిష్కరించాలనే డిమాండ్ మరింత పెరిగింది. అయినప్పటికీ కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనుమతితో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఆసియా కప్ 2025లో పాల్గొంది.
చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు
ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్లలో భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడుతున్నప్పటికీ.. ఇరు జట్లు చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. భారత్-పాకిస్తాన్ చివరిసారిగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. ఆ సమయంలో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. అలాగే భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్‌లో పర్యటించింది. ఇక, ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత జట్టు 2005-06 తర్వాత పాకిస్తాన్‌లో పర్యటించలేదు.